హైదరాబాద్‌ను ముంచిన వరదలకు అసలు కారణాలు బయటపెట్టిన హైడ్రా కమిషనర్

by Ramesh Naini |

నగరంలో మంగ‌ళ‌వారం వరద ముంచెత్తిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం పరిశీలించారు.

హైదరాబాద్‌ను ముంచిన వరదలకు అసలు కారణాలు బయటపెట్టిన హైడ్రా కమిషనర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో మంగ‌ళ‌వారం వరద ముంచెత్తిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం పరిశీలించారు. మాదాపూర్, కొండాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి వ‌ర‌ద ముంచెత్త‌డానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు వ‌ర్ల పాప‌య్య, డీఎఫ్‌వో, ఎస్ఎఫ్‌వోలు, వివిధ శాఖ‌ల‌కు చెందిన అధికారులుకూడా క‌మిష‌న‌ర్ వెంట ఉన్నారు. కొండాపూర్ నుంచి మొండికుంట‌కు చేరాల్సిన వ‌ర‌ద నీరు ప్ర‌వాహానికి మీనాక్షి టవర్స్ వద్ద బాక్స్ డ్రైన్లో త‌లెత్తిన ఇబ్బందులే కార‌ణ‌మ‌ని గుర్తించారు. బాక్స్ డ్రైన్‌ను పూర్తిగా స్లాబ్ వేసి మూసేయ‌డంతో అందులో పూడిక‌ను తీయ‌డానికి వీలు లేని ప‌రిస్థ‌ితులున్నాయి.. అలాగే మీనాక్షి ట‌వ‌ర్స్ వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి వ‌ర‌ద కాలువ కుంచించుకుపోవ‌డం కూడా ఒక కార‌ణంగా గుర్తించారు. వెంట‌నే కాలువ‌ను తెరిపించి.. పూడిక‌ను తొల‌గించాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు. అవ‌స‌ర‌మైతే కాలువ‌ను విస్త‌రించాల‌ని కూడా సూచించారు. ఒక్క మొండి కుంట వ‌ద్దే కాకుండా.. గ‌చ్చిబౌలి ప్ర‌ధాన ర‌హ‌దారిలోని బ‌యోడైవ‌ర్సిటీ పార్కు ప‌రిస‌రాలు నీట మున‌గ‌డానికి కూడా అక్క‌డ ఉన్న ఖాజాగూడ చెరువుతో పాటు.. మ‌ల్కం చెరువుకు వెళ్లే ఇన్‌లెట్లు స‌రిగా లేక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని గుర్తించారు.

రెండు రోజుల్లో ప‌నుల‌న్నీ పూర్తి చేయాలి

ఇన్‌లెట్లు స‌రి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అధికారుల‌కు సూచించారు. రెండు రోజుల్లో ఈ ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మొద‌టి వ‌ర్షం కార‌ణంగా పెద్ద‌మొత్తంలో ర‌హ‌దారుల‌పై ఉన్న వ్య‌ర్థాలు కొట్టుకు వ‌చ్చి చెత్త అడ్డుప‌డ‌డం వ‌ల్ల కూడా చాలా చోట్ల వ‌ర‌ద ర‌హ‌దారుల‌ను, ప‌రిస‌రాల‌ను ముంచెత్తిన‌ట్టు గ్ర‌హించారు. రాయ‌దుర్గం మెట్రో స్టేష‌న్ ప‌రిస‌రాల్లో పూడుకుపోయిన నాలా, మ్యాన్‌హోల్ కార‌ణంగానే వ‌ర‌ద నీరు నిలిచింద‌ని.. వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

*ఎస్ఎన్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బాక్స్ డ్రైన్‌కు గ‌తంలో ఉన్న లైన్ల‌ను అనుసంధానం చేయ‌డంలో త‌లెత్తిన ఇబ్బందుల‌తోనే మాధాపూర్‌లోని నెక్ట‌ర్ గార్డెన్స్ ప‌రిస‌రాల్లో ర‌హ‌దారులు నీట మునిగాయ‌ని గుర్తించారు. ఈ అనుసంధానంతో పాటు.. ర‌హ‌దారుల‌పై నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువ‌లోకి వెళ్లేలా అక్క‌డ ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గం చెరువులో నీటి సామ‌ర్థ్యాన్ని కూడా త‌గ్గిస్తే ఈ ప్రాంతంలో వ‌ర‌ద పోటెత్త‌ద‌ని.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

*మియాపూర్లోని గురునాథ్ చెరువుకు వెళ్లాల్సిన వ‌ర‌ద కాలువ‌లు స‌రిగా లేక‌పోవ‌డంతో జేపీన‌గ‌ర్ చౌర‌స్తాతో పాటు ల‌క్కీ రెస్టారెంట్ వ‌ద్ద ప్ర‌ధాన ర‌హ‌దారిలో నీరు నిలిచిపోయింద‌ని అధికారులు గుర్తించారు. ప్రిమార్క్ సుంకృతి అపార్ట్‌మెంట్ ప‌రిస‌రాల్లో చెరువుకు వెళ్లాల్సిన వ‌ర‌ద కాలువ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కావ‌డం.. మొత్తం మూసేయ‌డంతో వ‌ర‌ద నీరు ర‌హ‌దారుల‌ను ముంచెత్తిన ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. అలాగే ఇటీవ‌ల కొత్త‌గా ర‌హ‌దారులు నిర్మించిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న వ‌ర‌ద కాలువ‌ల్లోకి వ‌ర్షం నీరు వెళ్లే ఏర్పాట్లు బంద్ అవ్వ‌డం కూడా ఒక కార‌ణంగా గుర్తించారు. వెంట‌నే వ‌ర‌ద కాలువల‌ను పున‌రుద్ధ‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

Next Story