- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ పోలీసుల ఘనత.. 18 రోజుల్లోనే 'ఇగ్నైట్' మల్టీలెవల్ మార్కెటింగ్ మోసానికి చెక్!
5 వేల కోట్ల రూపాయలను అమాయక ప్రజల నుంచి వసూలు చేసి మోసానికి పాల్పడేందుకు స్కెచ్ వేసిన ఇగ్నైట్ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఆర్థిక కుట్ర కోణాన్ని హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.

దిశ, సిటీ క్రైమ్: 5 వేల కోట్ల రూపాయలను అమాయక ప్రజల నుంచి వసూలు చేసి మోసానికి పాల్పడేందుకు స్కెచ్ వేసిన ఇగ్నైట్ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఆర్థిక కుట్ర కోణాన్ని హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ టీజీఐసీసీసీ భవనంలో సీపీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిషేధిత క్యూ నెట్ సంస్థ కొత్త అవతారమెత్తి ఇగ్నైట్ పేరుతో తన కార్యకలాపాలను 18 రోజుల కిందట ప్రారంభించింది. డైరెక్ట్ సెల్లింగ్, మనీ సర్క్యూలేషన్, మల్టీలెవల్ మార్కెటింగ్ ముసుగులో అమాయకులను ఆశతో మభ్యపెట్టి దాదాపు 5 వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. ఈ సంస్థలో 1.87 లక్షల రూపాయాలను జమ చేసి ఆ నెట్ వర్క్‌లో చేరిన ముగ్గురు బాధితులు హైదరాబాద్ లోని పలు స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుల గురించి తెలుసుకున్న సీపీ సజ్జనార్ సీసీఎస్ ఎకనామిక్స్ వింగ్ ద్వారా ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి ఈ నెట్ వర్క్ మూలాలను పసిగట్టారు. గతంలో 7500 కోట్ల రూపాయల వరకు మోసానికి పాల్పడిన క్యూ నెట్ సంస్థ నిర్వాహకులే ఇగ్నైట్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టారని తెలుసుకున్నారు. ఇగ్నైట్‌కు సంబంధించి మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలో చేరిన బాధితులు డబ్బులు పంపించిన బ్యాంకులు ఇతర వ్యవహారాలను దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఇగ్నైట్ ఢిల్లీ, కేరళ, వెస్ట్ బెంగాల్ , ఢిల్లీ ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజలను ఈ మోసపూరిత స్కీమ్‌లలో చేర్పించడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టమైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హాంగ్ కాంగ్ లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
గత 25 ఏళ్లుగా నిర్వాహకులు గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్ నెట్, క్యూ నెట్ పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని తేలింది. వీటి పై కేసులు నమోదు కాగానే పేర్లు మారుస్తున్నారన్నారు. ఇప్పుడు ఇగ్నైట్ పేరుతో మోసం చేయడానికి వచ్చారని తెలిపారు. ఇలాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ లలో అమాయక ప్రజలు చేరి మోసపోయి ఇంకా ఆర్థిక కష్టాల్లోకి పడిపోతున్నారని వివరించారు. కొందరైతే ఆత్మహత్యలకు కూడా చేసుకున్నారని సీపీ చెప్పారు. మన దేశ చట్టాల ప్రకారం మల్టీలెవల్ మార్కెటింగ్, మని సర్క్యూలేషన్ స్కీం లపై నిషేధం ఉండడంతో ఈ సంస్థల ఆగడాలను సాగనివ్వమని సీపీ హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి స్కీంలలో చేరి మీ ఆర్ధిక పరిస్థితులను చిన్నాభిన్నం చేసుకోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
అరెస్టైన వారిలో ఒనియల్ గుప్తా (ఇగ్నైట్ టీం లీడర్), దినేష్ కుమార్ సాహిల్(డైరెక్టర్) ప్రియాన్షు సక్సేనా(డైరెక్టర్), ప్రవీణ్ కుమార్ దకాలియా(డైరెక్టర్), పరితోష్ కుమార్ దకాలియా(డైరెక్టర్), రియాజ్(ఫీల్డ్ రిక్రూటర్) లు ఉన్నారు. ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయ్యి ఇగ్నైట్ సంస్థ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ దందాను ప్రారంభించాయన్నారు. క్యూనెట్ తో పాటు ఇతర సంస్థలను ప్రారంభించిన వ్యవస్థాపకుడు సేనాధి రాజా పరారీలో ఉన్నారని ఆయన వివరించారు. అతని పై దేశంలో చాలా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మని సర్క్యూలేషన్, మల్టీలెవల్ మార్కెటింగ్ ఇతర చైన్ సిస్టమ్ సంస్థల స్కీమ్ లపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మోసపోయిన వారు ఫిర్యాదులు చేయాలని సీపీ కోరారు. ఈ ఆర్థిక కుట్రను బయటపెట్టిన పోలీస్ అధికారులను సీపీ అభినందించారు. మీరు చేరి మరికొంతమందిని చేర్పించి వస్తువులు కొనిపించేలా చేస్తే మీకు భారీగా డబ్బులు వస్తాయని చెబితేనే అది మోసమని గుర్తించుకోవాలని సీపీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు.






