రైతులను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు.. ప్రభుత్వంపై ఏలేటి తీవ్ర విమర్శలు

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతులను, ఉద్యోగులను మోసం చేస్తున్నారు.. ప్రభుత్వంపై ఏలేటి తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు సుమారు 1 కోటి 41 లక్షల టన్నుల వరిని పండిస్తే, ప్రభుత్వం మొదట 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 75 లక్షల టన్నులుగా చెప్పి, చివరికి కేవలం 64 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారని ఏలేటి విమర్శించారు.

కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం..

తెలంగాణ (Telangana) నుంచి 60 శాతం వరిని కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రంపై బురదజల్లడానికి, బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు ప్రతి గింజనూ కొంటామని, మద్దతు ధర (MSP) కల్పిస్తామని, విదేశాలకు ఎగుమతి చేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని, ఆయనకు అధికారంలో కొనసాగే హక్కు లేదని ఏలేటి డిమాండ్ చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల (Indira Houses) పథకానికి బడ్జెట్‌లో రూ.7 వేల కోట్లు కేటాయించినా అందులో రూ.4,640 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవేనని స్పష్టం చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర వాటా కేవలం రూ.46 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. ఈ ఏడాది కూడా మెజారిటీ నిధులు కేంద్రానివేనని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికంగా కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రూ.50 వేల కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో ఇప్పటికే రూ.11,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసిందని తెలిపారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

Next Story