స్లాట్ బుక్ అయినా యూరియా మాయమైందే! బ్లాక్ మార్కెట్‌కు తరలించారంటూ రైతుల ఆందోళన

by Ramesh Naini |

యూరియా పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ మర్రిగూడ చౌరస్తాలోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

స్లాట్ బుక్ అయినా యూరియా మాయమైందే! బ్లాక్ మార్కెట్‌కు తరలించారంటూ రైతుల ఆందోళన
X

మర్రిగూడలో యూరియా పంపిణీ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకున్నా ఎరువులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగారు. నిర్వాహకులు నిల్వలను అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు మండిపడుతున్నారు. మండల వ్యవసాయ అధికారి జోక్యం చేసుకున్నా పరిష్కారం లభించకపోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పంపిణీలో అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే యూరియా అక్రమ విక్రయాలకు పాల్పడిన ‘మన గ్రోమోర్’ సెంటర్ లైసెన్స్‌ను వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే రద్దు చేశారు. స్లాట్ బుకింగ్ నిబంధనలు ఉల్లంఘించి 444 బస్తాల యూరియాను పక్కదారి పట్టించినట్లు తేలడంతో ఏడీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, మర్రిగూడ : యూరియా పంపిణీలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ మర్రిగూడ చౌరస్తాలోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సూచించిన స్లాట్ ప్రకారం బుక్ చేసుకున్నప్పటికీ నిర్వాహకుడు రఘు నిల్వలు లేవని సాకులు చెబుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు. స్లాట్ బుక్ అయి 24 గంటలు దాటినా ఫోన్లలో వివరాలు చూపించినా ఎరువులు పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. అధికారులు, నిర్వాహకుడు కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాట్ బుకింగ్, పంపిణీపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మండల వ్యవసాయ అధికారి మాటలకు, నిర్వాహకుడి తీరుకు పొంతన లేకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి సుహాస్‌ను వివరణ కోరగా మన గ్రూపు వరకు స్టాక్ వచ్చిన విషయమే తమకు తెలియదని స్లాట్ బుక్ అయినా వెంటనే కన్ఫామ్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతనే యూరియా డెలివరీ చేయాలని పేర్కొన్నారు. స్టాక్ విషయం తమకు తెలియకుండా నిర్వాకుడు పంపిణీ చేయడంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తానని ఆయన వివరణ ఇచ్చారు.

మర్రిగూడ ‘మన గ్రోమోర్’ ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు..

నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయాలు జరిపినందుకు మర్రిగూడలోని ‘మన గ్రోమోర్ సెంటర్’ ఫెర్టిలైజర్ లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ మునుగోడు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) బి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ ద్వారా స్లాట్ బుక్ చేసుకోని వారికి నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ నెల 24న డీలర్ పొందిన 19.98 మెట్రిక్ టన్నుల (444 బస్తాలు) యూరియాను, 25, 26 తేదీల్లో అనధికారికంగా విక్రయించారని ఏడీఏ పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు ఎరువుల కోసం రాగా స్టాక్ లేకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ‘ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-1985’ ప్రకారం డీలర్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

Next Story