కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్య.. జొన్నలు కొనకపోవడంతో విషాదం!

by Ramesh Naini |

పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లి, రోజుల తరబడి ఎదురు చూసి మనస్తాపానికి గురైన ఓ రైతు కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

కొనుగోలు కేంద్రంలోనే రైతు ఆత్మహత్య.. జొన్నలు కొనకపోవడంతో విషాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పండించిన పంటను అమ్ముకునేందుకు వెళ్లి, రోజుల తరబడి ఎదురు చూసి మనస్తాపానికి గురైన ఓ రైతు కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగూరే పాండురంగ్ (48) మే 23న తాను పండించిన జొన్నలను సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. అయితే, హమాలీలకు నిర్దేశిత రుసుము చెల్లించినప్పటికీ, లారీలో లోడ్ చేయడానికి వారు అదనపు డబ్బులు డిమాండ్ చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన వద్ద డబ్బులు లేవని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పది రోజులుగా అధికారులు జొన్నలు కొనుగోలు చేయకపోవడం, లారీలో లోడింగ్ కూడా నిలిచిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండురంగ్.. అదే కొనుగోలు కేంద్రంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. అన్నదాత ఆకస్మిక మృతితో మృతుని ఇంట, పొన్న గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story