- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti : మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధుల విడుదల : భట్టి
మూడు ఎకరాల(Three Acres) వరకు రైతు భరోసా(Raitu Bharosa) నిధుల విడుదలను వెంటనే పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : మూడు ఎకరాల(Three Acres) వరకు రైతు భరోసా(Raitu Bharosa) నిధుల విడుదలను వెంటనే పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరక్టర్ గోపీ సహా ఆర్థిక, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రైతు భరోసా మూడు ఎకరాల లోపు లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు.
లబ్ధిదారుల వివరాలు గ్రామ కూడళ్లలో అందరికి కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి భట్టి విక్రమార్క బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయరంగానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరుపై చర్చించారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిని సమీక్షించారు.
ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని..బ్యాంకర్లు ఇందులో కీలక భాగస్వాములన్నారు. స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, శాంతి భద్రతలు మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పడమే కాదు చేసి చూపామని తెలిపారు. ఈ ఒక్క రంగానికి 52,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద సుమారు 22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాంకర్లకు మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా 22 వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని, సింగిల్ స్ట్రోక్ తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలి అన్నారు.
రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 11,500 కోట్లు, రైతు బీమా కింద 1,500 కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద సబ్సిడీ మొత్తం 11 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా 1,800 కోట్లు, ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
మార్చి 2న 6వేల కోట్ల స్వయం ఉపాధి పథకాల ప్రారంభం
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలు పాలించిన వారు సంక్షేమరంగాన్ని మూలన పడేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన స్వయం ఉపాధి పథకాలకు తిరిగి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ రంగానికి బ్యాంకర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు. మార్చి 2న వనపర్తి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వయం ఉపాధి పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఇవి రాష్ట్ర జీడీపీని పెంచేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
దేశ ఆలోచనను ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వివరించారు. మహిళలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు.
హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, హైదరాబాదు నగరానికి మూసీ నది మణిహారంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. మూసీ నదిని పునర్జీవింపజేసి ఆదాయంతో పాటు, పరిసరాల్లో నివసించే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. మూసీ నది అభివృద్ధి క్రమంలో నిర్వాసితులు అయ్యే వారికి బ్యాంకర్లు ఆర్థికంగా చేయూతను అందించాలన్నారు. మూసీ నిర్వాసిత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం అన్నారు. ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించినట్టు తెలిపారు. కోటి మంది జనాభా ఉండే హైదరాబాద్ నగరంలో మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తాం అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఇండస్ట్రియల్, ఫార్మా, హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయి అన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అన్నారు.
లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ(MSME) సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు ఆర్థిక చేయుత అందించాలి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నారు.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని బడ్జెట్ కు ముందు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు.






