"కుబేర" సీన్ రిపీటెడ్... నిండు గర్భిణీని భుజాలపై మోసుకు వెళ్ళిన కుటుంబ సభ్యులు

by Muthe.Rajitha |

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'కుబేర' సినిమా గుర్తుండే ఉంటుంది.

కుబేర సీన్ రిపీటెడ్... నిండు గర్భిణీని భుజాలపై మోసుకు వెళ్ళిన కుటుంబ సభ్యులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'కుబేర' సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో నిండు గర్భిణీ అయిన తన చెల్లెల్ని హీరో ధనుష్ వీపుపై మోస్తూ ఆసుపత్రికి పరుగులు తీస్తాడు. అయితే రియల్ లైఫ్ లో అలాంటి సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలోని మున్యా నాయక్ తండాలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆశాకార్యకర్తకు సమాచారం అందించారు. కానీ ఆ తండాకు చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో, అంబులెన్స్ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో భారీ వర్షం కూడా మొదలవ్వడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. సమయం గడిచేకొద్దీ గర్భిణీకి పురిటి నొప్పులు అధికం కావడంతో వేరే గత్యంతరం లేక, ఆమెను వీపు మీద 2 కిలోమీటర్ల దూరం మోస్తూ అంబులెన్స్ వద్దకు చేర్చే ప్రయత్నం చేసారు కుటుంబ సభ్యులు.

అయితే మార్గమధ్యంలోనే ఆ మహిళ ప్రసవించి, ఆడపిల్లకు జన్మనిచ్చింది. దాదాపు రెండు గంటలపాటు నరకం అనుభవించిన తర్వాత ఆమెను అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసాయి. మున్యా నాయక్ తండాకు వెంటనే రహదారి నిర్మించాలని జిల్లా కలెక్టర్ కు వినతులు వెలువెత్తాయి.

Next Story