యుద్ధంపై తిక్క పోస్టులు... 19 మంది భారతీయులపై యూఏఈ కఠిన చర్యలు

by Prasad Jukanti |

యుద్ధంపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, AI వీడియోలు పోస్ట్ చేసిన 19 మంది భారతీయులపై యూఏఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోంది.

యుద్ధంపై తిక్క పోస్టులు... 19 మంది భారతీయులపై యూఏఈ  కఠిన చర్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇజ్రాయె, అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరు పక్షాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వేస్తూ సిట్యుయేషన్‍ను మరింత పీక్స్ కు తీసుకువెళ్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే యుద్ధం విషయంలో సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే, కల్పిత వీడియోలను పోస్టు చేశారనే ఆరోపణలపై తాజాగా భారతీయులపై యూఏఈ (UAE) కఠిన చర్యలకు సిద్ధమైంది. మొత్తం 19 మంది భారతీయులతో (Indians) సహా మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఆదేశించింది.

మూడు నేరారోపణలు:

కృత్రిమ మేధ (AI) ఉపయోగించి సృష్టించిన తప్పుడు దృశ్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించారనే ఆరోపణలు వీరిపై మోపబడ్డాయి. ఇందులోని నిందితులను మూడు వర్గాలుగా విభజించినట్లు యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ తెలిపారు. మొదటి గ్రూపులోని వారు క్షిపణులను అడ్డుకుంటున్న అసలు వీడియోలకు భయాందోళన కలిగించే సౌండ్ ఎఫెక్ట్స్, వ్యాఖ్యలను జోడించి షేర్ చేశారని ఇది దేశ రక్షణ సామర్థ్యాలను శత్రువులకు బహిర్గతం చేసే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక రెండవ గ్రూపులోని వారు AI ఉపయోగించి నకిలీ పేలుళ్లు, దాడుల దృశ్యాలను సృష్టించారని ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. మూడవ గ్రూపులోని వారు శత్రు దేశమైన ఇరాన్‌ను, ఆ దేశ సైనిక చర్యలను పొగుడుతూ యూఏఈ జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రచార చిత్రాలను విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

శృతి మించుతున్న కంటెంట్:

ఇటీవల కాలంలో ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే అక్కడికి వెళ్లిన వారు తమ దైనందిన జీవితాన్ని, పని ప్రదేశాలను (Workplaces) సోషల్ మీడియాలో పంచుకోవాలనే ఉత్సాహంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొందరు వీడియో కంటెంట్ క్రియేట్ చేసి తమ పార్ట్ టైమ్ ఇన్ కమ్ గా మలుచుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా వీరిలో చాలా మంది స్థానిక చట్టాలు, నియమాలు, సెంటిమెంట్లకు విరుద్ధంగా వీడియోలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ షేక్‍ల వద్ద పని చేస్తున్న చాలా మంది తెలుగు వారు యూట్యూబర్లుగా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అయితే వీరిలో కొందరు తమ సొంత యజమానులపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో తమ ఫాలోవర్సే కామెంట్స్ రూపంలో హెచ్చరిస్తున్నా లైకులు, షేర్ల కోసం వారు వెనక్కి తగ్గడం లేదు. తాము దేశం కాని దేశంలో ఉంటున్నామని అక్కడ ఇబ్బందులు వస్తే తమ పరిస్థితి ఏమిటి అనే ఇంగితం కూడా లేకుండా శృతి మించి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా యూఏఈ తీసుకున్న నిర్ణయం విదేశాల్లో ఉంటున్న మిగతా భారతీయలకు ఓ హెచ్చరిక అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Next Story