ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తప్పుడు సమాచారం..బిల్ కలెక్టర్ తొలగింపు

by Ajay Maddhiboyina |

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తప్పుడు సమాచారం..బిల్ కలెక్టర్ తొలగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో అవకతవకలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరగకుండానే, పూర్తయిందని తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేసిన బిల్ కలెక్టర్ జగదీశ్‌పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు.

ఈ మేరకు బిల్ కలెక్టర్ జగదీశ్‌ను విధుల నుండి తొలగిస్తూ జిల్లా పంచాయతీ అధికారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 18 మంది లబ్ధిదారులు బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి చేశారనే తప్పుడు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, దీనిపై సంబంధిత బిల్ కలెక్టర్‌కు మెమో జారీ చేయగా పొరపాటున ఈ సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం అయిందని సంజయిషీ ఇచ్చారు. దీంతో ఆ బిల్ కలెక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు జిల్లా పంచాయతీ అధికారి వెల్లడించారు.

Next Story