- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటా దక్కలేదనే అసత్య ఆరోపణలు.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో హరీశ్ రావు ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: తాము కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఆ సమయాన్ని అదనుగా తీసుకుని ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమపై అబద్ధాలు ప్రచారం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. దేవాలయం లాంటి శాసనసభలో వారి ప్రవర్తనను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలా..
ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందన్న భయంతో మంత్రి కోమటిరెడ్డిని, అలాగే మద్యం పాలసీ, టూరిజం పాలసీల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తమకు అంటిన బురదను ఇప్పుడు మంత్రులందరికీ పూయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
నాటి రిజిస్ట్రేషన్లతో మాకేం సంబంధం..
నాదర్‌గుల్ భూముల విషయంలో హరీశ్ రావు చేస్తున్నవి, చెబుతున్నవి అబద్ధాలేనని మంత్రి కొట్టిపారేశారు. సర్వే నంబర్ 613లోని భూములను 2014లోనే మూడు సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని ఆధారాలు చూపారు. 2016లో మ్యూటేషన్ జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. నాటి రిజిస్ట్రేషన్లతో తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, నాలా కన్వర్షన్ విషయంలో సదరు సంస్థలు కోర్టుకు వెళ్తే నాటి ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అవి ప్రభుత్వ భూములని గట్టిగా కౌంటర్ వేశామని చెప్పారు. గతంలో వాటాల ఒప్పందం చేసుకుని.. భూములు కట్టబెట్టి వాటాలు దక్కలేదని ఇప్పుడు తమపై నిందలు వేయడం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి విమర్శించారు.






