రూ.4,215 కోట్ల ఫాల్కన్ స్కామ్‌.. కీలక వ్యక్తి అరెస్ట్

by Naga Rani Yarlagadda |

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ మోసం కేసులో తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు కీలక అరెస్ట్ చేశారు.

రూ.4,215 కోట్ల ఫాల్కన్ స్కామ్‌.. కీలక వ్యక్తి అరెస్ట్
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ మోసం కేసులో తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు కీలక అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులకు దొడ్డిదారిన సహకరించిన ప్రముఖ పేమెంట్ గేట్‌వే సంస్థ వరల్డ్‌లైన్ ఈ పేమెంట్ గేట్‌వే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహియుద్దీన్‌ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. తక్కువ వ్యవధిలో భారీ లాభాలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా అమాయకుల నుంచి ఏకంగా రూ.4,215 కోట్లు వసూలు చేసిన ఈ కేసులో, నిందితులకు పేమెంట్ గేట్‌వే సేవలు అందించిన ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐడీ ఉన్నతాధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

7,056 మంది నుంచి రూ.4,215 కోట్ల డిపాజిట్ల సేకరణ

మల్టీ నేషనల్ కంపెనీల పేర్లను వాడుకుంటూ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా నిందితులు ఈ బాగోతానికి తెరతీశారు. నకిలీ పెట్టుబడి పథకాలను ఇన్వెస్ట్‌మెంట్ డీల్స్ సృష్టించి, స్వల్పకాలిక పెట్టుబడులతో ఊహించని లాభాలు గడించవచ్చని నమ్మబలికారు. ఈ ఆశల వలలో చిక్కుకున్న దేశవ్యాప్తంగా సుమారు 7,056 మంది ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.4,215 కోట్లను అక్రమంగా డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఆ తర్వాత ఫాల్కన్ యాప్ ముసుగులో పనిచేస్తున్న క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా సుమారు 4,065 మంది బాధితులను నిలువునా ముంచి, ఏకంగా రూ.792 కోట్లను స్వాహా చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయింది.

వరల్డ్‌లైన్ సంస్థ రూ.7.53 కోట్ల ట్రాన్సాక్షన్ ఎర్నింగ్స్

ఈ ఆర్థిక మోసంలో ముంబైకి చెందిన వరల్డ్‌లైన్ ఈ-పేమెంట్ గేట్‌వే ఈవీపీ షేక్ మొహియుద్దీన్ పాత్ర అత్యంత కీలకమని అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితులతో కుమ్మక్కైన ఆయన, ఎలాంటి చట్టబద్ధత లేని ఫాల్కన్ సంస్థకు తమ పేమెంట్ గేట్‌వే ద్వారా నిధుల సేకరణకు యథేచ్ఛగా అవకాశం కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించేందుకు సహకరించారు. ఈ మోసపూరిత లావాదేవీలను అనుమతించినందుకు గాను.. వరల్డ్‌లైన్ సంస్థ ఏకంగా రూ.7.53 కోట్లను కమిషన్ ట్రాన్సాక్షన్ ఎర్నింగ్స్ రూపంలో పొందినట్లు సీఐడీ దర్యాప్తులో బట్టబయలైంది.

అధిక లాభాల ఆశచూపే యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి : సీఐడీ

బాధితుల ఫిర్యాదుల మేరకు, నిందితులపై భారతీయ న్యాయ సంహిత లోని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్, కుట్ర సెక్షన్లతో పాటు, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. ప్రధాన నిందితులు, వారి అనుచరులపై దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కాగా, ఆన్‌లైన్‌లో ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట లేదా అనూహ్యమైన భారీ లాభాలు ఇస్తామంటూ వచ్చే నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ సీఐడీ ప్రజలను హెచ్చరించింది. కష్టపడి సంపాదించిన డబ్బును ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడిగా పెట్టే ముందు.. సదరు సంస్థల చట్టబద్ధతను, విశ్వసనీయతను కచ్చితంగా ధ్రువీకరించుకోవాలని సూచించింది.

Next Story