ఐపీఎల్ క్రికెట్ అభిమానులే లక్ష్యంగా నకిలీ టికెట్ల దందా

by velandi.Saikiran |

ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

ఐపీఎల్ క్రికెట్ అభిమానులే లక్ష్యంగా నకిలీ టికెట్ల దందా
X

ఐపీఎల్ క్రికెట్ అభిమానులే లక్ష్యంగా నకిలీ టికెట్ల దందా..

వీఐపీ పాస్‌లు, భారీ డిస్కౌంట్ల పేరుతో ఎర,,

అధికారిక యాప్ ద్వారానే కొనుగోలు చేయాలి..

అప్రమత్తంగా ఉండాలి... టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్...

దిశ,తెలంగాణ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూసేందుకు ఎగబడుతున్న అభిమానుల ఆరాటమే పెట్టుబడిగా నకిలీ టికెట్ల దందాకు తెరలేపారు. సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల విసురుతూ నిలువునా దోచేస్తున్నారు. ఈ సైబర్ మోసాలపై బుధవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆందోళన వ్యక్తం చేస్తూ.. క్రికెట్ అభిమానులను అప్రమత్తం చేసేలా అడ్వైజరీ జారీ చేసింది. అనధికారిక ఏజెంట్ల వద్ద టికెట్లు కొని మోసపోవద్దని తెలిపింది..

వీఐపీ పాస్‌లు.. భారీ డిస్కౌంట్..

టీజీసీఎస్‌బీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, అనధికారిక ఏజెంట్ల అవతారమెత్తి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. వీఐపీ,వీవీఐపీ పాస్‌లు ఇస్తాం.. మా దగ్గర భారీ డిస్కౌంట్లు ఉన్నాయి.. లాస్ట్ మినిట్ టికెట్లు ఉన్నాయి.. అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఊరించే పోస్టులు పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో అప్పటికే పూర్తిగా అమ్ముడుపోయిన మ్యాచ్‌లకు సైతం తమ వద్ద టికెట్లు ఉన్నాయని నమ్మిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌లు, యూపీఐ, బ్యాంకు ఖాతాల ద్వారా ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. తీరా డబ్బులు పంపగానే ఎడిట్ చేసిన నకిలీ బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్‌లు, ఫేక్ టికెట్లు పంపడం లేదా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉడాయించడం చేస్తున్నారు. కొన్ని కీలక విషయాలను గమనిస్తే ఈ మోసాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ బ్యూరో సూచించింది. ఇక కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.. వెంటనే డబ్బులు పంపండి అంటూ ఒత్తిడి చేయడం నేరగాళ్ల ప్రధాన లక్షణమని పేర్కొంది. అధికారిక పేమెంట్ గేట్‌వేలకు బదులుగా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు డబ్బులు పంపమనడం, తక్కువ ఫాలోవర్లు ఉండి కొత్తగా క్రియేట్ చేసిన సోషల్ మీడియా పేజీల ద్వారా ఆఫర్లు ప్రకటించడం, ముందే పూర్తి డబ్బు చెల్లించాలని డిమాండ్ చేయడం.. ఇవన్నీ సైబర్ నేరగాళ్లు అనుసరించే పద్ధతులని, వీటిని అస్సలు నమ్మొద్దని స్పష్టం చేశారు.

అధికారిక యాప్‌లోనే కొనండి..

ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్ల కొనుగోలుకు ద డిస్ట్రిక్ట్ యాప్ మాత్రమే అఫీషియల్ పార్ట్‌నర్ అని, అందులో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని శిఖా గోయల్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ యూఆర్ఎల్ సరైనదా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు. తెలియని ఏజెంట్ల నుంచి, సోషల్ మీడియాలో అమ్మేవారి నుంచి టికెట్లు కొనొద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ నకిలీ టికెట్ల వలలో పడి మోసపోతే లేదా ఏమైనా అనుమానాస్పద లింక్స్ వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Next Story