- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టగొడుగుల్లా నకిలీ స్కిన్ ఎక్స్‌పర్ట్స్, ప్రజారోగ్యానికి కొత్త ముప్పు
రాష్ట్రంలో నకిలీ స్కిన్ స్పెషలిస్ట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తీరు తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నకిలీ స్కిన్ స్పెషలిస్ట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న తీరు తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో రీల్స్, ఫాలోవర్స్, గ్లామర్ సలహాలతో స్కిన్ ఎక్స్‌పర్ట్స్‌గా కనిపించే చాలా మంది అసలు వైద్య అర్హతలు లేని వ్యక్తులన్నది తాజాగా వెలువడిన ఒక రాష్ట్రవ్యాప్త సర్వేలో బయటపడింది. వీరిపై నమ్మకం ఉంచిన ప్రజలు లేజర్ బర్న్స్, కెమికల్ పీల్స్ వల్ల వచ్చే గాయాలు, అన్‌స్టెరైల్ ఇంజెక్షన్ల ఇన్ఫెక్షన్లు, స్టెరాయిడ్ దుర్వినియోగం వంటి ప్రమాదాలతో శాశ్వత నష్టాలను ఎదుర్కొంటున్నారని మెడివాయిస్ సర్వేలో తేలింది. తాజా గణాంకాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎండీ (డీవీఎల్) డెర్మటాలజిస్టుల్లో 86 శాతం మంది గత రెండేళ్లుగా నకిలీ క్లినిక్‌లు, బ్యూటీ పార్లర్లు, ఇన్‌స్టా స్కిన్ గురు అకౌంట్‌ల కారణంగా తీవ్రమైన చర్మ సమస్యలతో వచ్చిన రోగులను చికిత్స చేశామని చెప్పారు. ప్రతి వారం డీప్ లేజర్ బర్న్స్, చెరగని పిగ్మెంటేషన్, ఫిల్లర్‌ల కారణంగా రక్తనాళాలు మూసుకుపోయిన కేసులు నమోదవుతున్నాయి.
సోషల్ మీడియాలో చెలరేగుతున్న నకిలీలు..
సోషల్ మీడియా ప్రకటనలు ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. ఇందులో విద్యార్థినులు, యువతులు, ఐటీ రంగంలో పనిచేస్తున్న మహిళలే ఎక్కువ. ఏమాత్రం అర్హత లేని టెక్నీషియన్లు ఆన్‌లైన్‌లో కొన్న చిప్ లేజర్ పరికరాలతో ముఖాల మీదే ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిపోతోంది. వైద్యులు చెబుతున్న ప్రకారంగా.. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, ప్రజల ఆరోగ్యంపై జరుగుతున్న వినాశకరమైన వైద్య ప్రయోగం. తెలిసీ తెలియని వైద్యం వల్ల గాయపడ్డ రోగుల్లో అత్యధికులు అవమానం, ఆత్మన్యూనత, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
నకిలీ స్కిన్ ఎక్స్‌పర్ట్స్ పై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలకు దిగాలని డెర్మటాలజిస్టులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ లేజర్ సెంటర్లపై దాడులు, ప్రతి క్లినిక్‌లో ఎండీ (డీవీఎల్) అర్హతల ప్రదర్శన తప్పనిసరి చేయడం, బ్యూటీ పార్లర్లలో మెడికల్ ప్రొసీజర్‌ల నిషేధం, సోషల్ మీడియాలో వైద్య ప్రకటనలపై కఠిన పర్యవేక్షణ వంటి చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని వారు సూచిస్తున్నారు. “ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్... నకిలీ స్కిన్ డాక్టర్లకు ఇవే కేంద్రాలుగా మారుతున్నాయని... మెడికల్ కౌన్సిల్ ఇలాంటి వాటిపై ఉపేక్షించవద్దని కొండాపూర్ కు చెందిన సీనియర్ డెర్మటాలజిస్ట్ డా. వేమన్ హెచ్చరించారు. మీ చర్మం శాశ్వతం... నకిలీ డాక్టర్లు మాత్రం మీకు శాశ్వత ప్రమాదం.. అని హెచ్ఆర్డీఏ సీనియర్ ప్రతినిధి డా. బండారి రాజ్ కుమార్ తెలిపారు. నకిలీ డాక్టర్లు మీ జీవితాన్ని నాశనం చేస్తారని... సరైన అర్హతలున్న వైద్యులను మాత్రమే నమ్మాలని ఆయన కోరారు.






