రైతుల‌కు బిగ్ షాక్‌.. ఆన్‌లైన్‌లో నకిలీ విత్తనాలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-01 23:59:53  IST  )

వానకాలం సీజన్​ప్రారంభమవుతుండటంతో నకిలీ విత్తనాల మాఫియా విజృంబిస్తోంది. ఈసారి పోలీసులకు చిక్కకుండా ఆన్‌లైన్​ద్వారా విక్రయాలు చేపట్టింది.

రైతుల‌కు బిగ్ షాక్‌.. ఆన్‌లైన్‌లో నకిలీ విత్తనాలు
X

ఆన్‌లైన్‌లో నకిలీ విత్తనాలు

- అన్నదాతల సెల్‌ఫోన్లతో దళారుల బుకింగ్

- తనిఖీల్లో రైతులే దొరికేలా స్కెచ్

- పక్క రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతి

- పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్న దందా

దిశ, తెలంగాణ బ్యూరో : వానకాలం సీజన్​ప్రారంభమవుతుండటంతో నకిలీ విత్తనాల మాఫియా విజృంబిస్తోంది. ఈసారి పోలీసులకు చిక్కకుండా ఆన్‌లైన్​ద్వారా విక్రయాలు చేపట్టింది. ఒకవేళ విజిలెన్స్​బృందాలు తనిఖీలు చేస్తే కొనుగోలు చేసిన రైతులే పోలీసులకు దొరికేలా ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని వారిని రైతుల వద్దకు పంపుతూ నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచామని నమ్మబలుకుతూ అన్నదాతల సెల్‌ఫోన్​నుంచి ఆన్‌లైన్​ద్వారా బుకింగ్​చేస్తున్నారు. బహిరంగంగా అమ్మకాలకు స్వస్తి పలికి కొత్త పంథాను ఎంచుకున్నారు. పోలీసులకు పట్టుబడితే వచ్చిన లాభం వారికే ముట్టజెప్పాల్సి వస్తోందని ఆన్‌లైన్​దందాకు శ్రీకారం చుట్టినట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో నకిలీ విత్తనాలతో లక్షలాది మంది రైతులు మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉండటంతో ఇలాంటి పరిస్థితులు రాకుండా వ్యవసాయ శాఖ ముందుస్తు జాగ్రత్తలు చేపట్టినా.. విజిలెన్స్​బృందాలు ఏర్పాటు చేసినా.. దళారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో దందా దర్జాగా సాగిస్తున్నారనే టాక్​ఉంది.

ఆఫర్ల ఆశ చూపి..

పత్తి, మిర్చి, వరి విత్తనాలు పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని ఆన్‌లైన్​ద్వారా ఆఫర్లు ఇస్తుండటంతో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ, గద్వాల్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 10 ప్యాకెట్లు ఒక రైతు కొనుగోలు చేస్తే రెండు ప్యాకెట్లు ఉచితం, పక్క రైతులకు విక్రయాలు చేయిస్తే ప్యాకెట్లు ధరలో 25 శాతం కమిషన్​ఇస్తామని గుట్టుగా ప్రచారం చేస్తూ సాగు ప్రారంభించక ముందే తమ దందాను ముగించుకుని కోట్లు సంపాదించుకునేందుకు విత్తన వ్యాపారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్కెట్లో పత్తిలో హెచ్‌టీ( బీజీ–3) రకానికి డిమాండ్​ఉంది. గడ్డి, పురుగు మందులను తట్టుకునే శక్తి ఉండటంతోపాటు దిగుబడి వస్తోందని రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

టాస్క్‌ఫోర్స్ పనితీరు అంతంతే..

విత్తనాల సరఫరా వ్యవస్థలో అనేక దశలు ఉన్నప్పటికీ, ఎక్కడా సరైన తనిఖీలు జరగడం లేదు. అనుమతి లేని డీలర్లు, మధ్యవర్తులు గ్రామాల వరకు చేరి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది రైతులకు అసలైన విత్తనాలను, నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలో తెలియక మోసపోతున్నారు. వ్యవసాయ శాఖ రైతులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో నకిలీ విత్తనాల ముఠా రెచ్చిపోతుందనే విమర్శలు వస్తున్నాయి. రైతు సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయి. రైతు ముంగిట్లలో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా అవగాహన చేపట్టి అప్రమత్తం చేయాలి. నకిలీ ఆట కట్టేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినా అవి ఆశించిన స్థాయిలో నకిలీ ముఠాలను గుర్తించలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ఫిర్యాదులు చేస్తే తప్ప వారు ప్రత్యేక దృష్టి సారించడం లేదు. ఒకే నకిలీ విత్తనాలు దొరికిన పెద్ద మాఫియా వదలి స్థానికంగా ఉండే చిరు వ్యాపారులనే పట్టుకొని తాము ఏదో చేసినట్లు చూపించడం తప్ప అసలు మూలలపై దృష్టి పెట్టడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు డీలర్ల వద్దే కొనాలి..

నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండటానికి వ్యవసాయ నిపుణులు, అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులు లేదా ప్రభుత్వ డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలని స్పష్టం చేస్తున్నారు. విత్తనాలు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, రసీదుపై విత్తనాల రకం, లాట్ నంబర్, గడువు తేదీ స్పష్టంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలని అంటున్నారు. సీల్ వేసిన ప్యాకెట్లను మాత్రమే తీసుకోవాలని, ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేసి నాణ్యతను ధృవీకరించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ప్యాకింగ్ లేని విడి విత్తనాలు తక్కువ ధరకే వస్తున్నాయని దళారుల వద్ద విత్తనాలను కొనుగోలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలుగా అనుమానం వస్తే వెంటనే 100 కానీ స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

Next Story