ఒక్కొక్కరు ఆరు చొప్పున మొత్తం 18 బీర్లు తాగేశారు.. అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో జీరో

by Gantepaka Srikanth |

పబ్‌లకు వెళ్లి మద్యం తాగుతున్నారా..? వాహనం నడుపుతూ.. ఇంటికి వెళ్లేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతామని భయపడుతున్నారా..? మీకు అలాంటి భయం అవసరం లేదు.

ఒక్కొక్కరు ఆరు చొప్పున మొత్తం 18 బీర్లు తాగేశారు.. అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో జీరో
X

దిశ, మేడ్చల్ బ్యూరో: పబ్‌లకు వెళ్లి మద్యం తాగుతున్నారా..? వాహనం నడుపుతూ.. ఇంటికి వెళ్లేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతామని భయపడుతున్నారా..? మీకు అలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే పబ్‌లలో పుట్‌గా మద్యం తాగినప్పటికీ, ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో అసలు మద్యం తాగినట్లు రావడంలేదని మందుబాబులు అవాక్కవుతున్నారు. రూ.వేలు వెచ్చించి సీసాలకు సీసాల బీర్లు ఖాళీ చేసిన మత్తు ఎక్కకపోవడంపై మదనపడుతున్నారు.

కిక్కెక్కదూ..

నగరంలోని పలు పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఎంత తాగిన కిక్ ఎక్కడంలేదని మందుబాబులు వాపోతున్నారు. మొదట బాగానే ఉండేది.. కాని, రానురాను సరుకు నీళ్లలా ఉంటుందని చెబుతున్నారు. అసలు నీళ్లు కలపకుండా ‘రా’ తాగకూడదు.. కాని.. రా తాగినా కిక్ ఎక్కడంలేదని దిగులుపడుతున్నారు. నకిలీ మద్యమా అని అనుకుందామంటే.. సీసా ఒరిజినల్ ది.. సీలు వుంటుంది అని ఇటివల మందుబాబుల మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. హైదరాబాద్‌లో పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తనిఖీలు నామామాత్రంగా ఉండడంతో నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారమంతా పనిచేసే ఉద్యోగులు వీకెండ్‌లో పబ్‌కి వెళ్తేనే రిలాక్స్ అవుతామంటారు. వారమంతా కాలేజీలకు వెళ్లి అలసిపోయి.. పబ్బుకు వెళ్తేనే ఎంజాయ్‌మెంట్ అంటారు విద్యార్థులు. పబ్‌లో పరమితులేమీ ఉండవు.. ఇది చేయొద్దు.. అది చేయొద్దు అనే ఆంక్షలుండవు. తాగినంత తాగొచ్చు.. ఊగినంత ఊగోచ్చు.. డాన్స్ పేరుతో ఏం చేసినా అడిగేవాళ్లుండరూ.. ఆ అంశాలే యువతను ఆకర్షిస్తున్నాయి. దీన్నే కొందరు పబ్, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు క్యాష్ చేసుకుంటున్నారు. కాస్ట్లీ సీసాలలో నకిలీ మద్యాన్ని అంటగడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నింటిలో నాసిరకం ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌లు, రెస్టారెంట్‌లలో లైటింగ్ మ్యూజిక్ దగ్గర నుంచి మద్యం కోసం వాడే గ్లాసుల వరకు ప్రతీది ఆకట్టుకుంటుంది. అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. కస్టమర్లు వీటి మాయలో పడి మోసపోతున్నారు.

మూడుసార్లు టెస్ట్ చేసినా..

వీకెండ్‌లో ఎంజాయ్ చేద్దామని బోయిన్‌పల్లికి చెందిన ముగ్గురు స్నేహితులు శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని ఓ పబ్‌కు వెళ్లారు. పబ్‌లో ఒక్కొక్కరూ ఆరు బీర్లు తాగారు. ఆరు బీర్లు తాగినా కిక్కు ఎక్కినట్లు అనిపించలేదని, పబ్ నుంచి బయటకు వచ్చినట్లు వారు తెలిపారు. బయట వైన్ షాపులలో బీర్ల కోసం ట్రై చేశారని చెప్పారు. అప్పటికే వైన్ షాప్‌లు మూసివేయడంతో అర్దరాత్రి తమ కార్లను సెల్ప్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇండ్లకు బయలుదేరారు. అయితే ఓ యువకుడికి తన ఇంటికి వచ్చేటప్పుడు పోలీసులు వేర్వేరు చోట్ల మూడు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ముందుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ యువకుడు టెస్టుల్లో ఎక్కడ దొరికిపోతానేమోనని భయపడ్డానని పేర్కొన్నాడు. రెండోసారి టెస్టు చేసేటప్పుడు కొద్దిగా తడబడ్డాడు. అయితే మూడోసారి మాత్రం పోలీసులు టెస్టు చేయకుండానే వెళ్లమని చెప్పినా.. తానే టెస్టు చేయాలని మరీ కోరి చేయించుకున్నానని చెప్పుకొచ్చాడు. అయినా మూడోసారి చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లోనూ ఆ యువకుడు మద్యం తాగలేదని నిర్దారణ కావడంతో.. ఎంత తాగిన మద్యం మత్తు ఎక్కకపోవడంపై ఆలోచనలో పడ్డాడు. వీరిలో మరో యువకుడికి సైతం ఒకసారి టెస్టు చేసినా అదే సీన్ రీపీట్ అయ్యింది. దీంతో రూ.16 వేలు వెచ్చించి పబ్‌లో మద్యం తాగిన కిక్కు ఎక్కకపోవడంపై ఆ యువకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాస్ట్లీ సీసాలలో కల్తీ మద్యం తయారు చేసిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. పబ్‌లో కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారా..? లేదా స్పిరిట్‌లో ఏమైనా తేడాలున్నాయా..? అనే దానిపై అబ్కారీ శాఖ పరిశీలన చేసి నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.

Next Story