హస్తం పార్టీలో ముదురుతున్న వర్గపోరు.. సీనియర్లతో జూనియర్ల ఢీ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్తతరం నేతలకు మధ్య గొడవలు తరుచుగా జరుగుతున్నాయి.

హస్తం పార్టీలో ముదురుతున్న వర్గపోరు.. సీనియర్లతో జూనియర్ల ఢీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్తతరం నేతలకు మధ్య గొడవలు తరుచుగా జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల సీనియర్ నేతలు, స్థానిక నేతలకు మధ్య పంచాయితీలు ముదిరి రోడ్డున పడుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదాలు కాస్తా పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వస్తున్నాయి. ఈ వివాదాలు పార్టీలో ఎంతోకాలంగా ఉండి మంత్రులుగా పనిచేసిన వారి కేంద్రంగా రావడం గమనార్హం. జగిత్యాల నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య నెలకొన్న వివాదం చాలా రోజులు నడిచింది. పార్టీ రాష్ట్ర ముఖ్యులు వీరిద్దరి మధ్య సయోధ్యకి ప్రయత్నించినా వివాదం సద్దుమణగలేదు. చివరకు జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

కామారెడ్డిలో సీనియర్ వర్సెస్ జూనియర్..

కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇక్కడ కూడా సీనియర్ నేత వర్సెస్ జూనియర్ నేతగా రాజకీయాలు నడుస్తున్నాయి. కామారెడ్డిలో కూడా రెండు వర్గాలుగా నేతలు విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలకు దిగారు. వీరిద్దరి మధ్య వివాదం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఆయన వివరణ ఇచ్చారు. కాగా, షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో వెలుగులోకి రావడం ఆ వివాదంపై షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ వివరణ ఇవ్వాలని లేఖను పంపింది. ఈ లేఖకు వివరణ లేఖను షబ్బీర్ అలీ రాస్తూ ఆ ఆడియో నకిలీదని, మార్ఫింగ్ చేసిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

వనపర్తిలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి..

వనపర్తిలో నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీమంత్రి చిన్నారెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, పంచాయతీ ఎన్నికలు ఇరు నేతల మధ్య వర్గపోరును మరోసారి బట్టబయలు చేసింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌కి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడానికి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతనే కారణమంటూ పరోక్షంగా చిన్నారెడ్డిని ఉద్దేశించి మేఘారెడ్డి ఆరోపణలు చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అయితే నేతల మధ్య వర్గపోరు, విభేదాలు స్థానికంగానే ఉన్నాయి. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కొనసాగుతున్న కొందరు నేతలకు స్థానికంగా ఉన్న నేతలు, గత ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన వారికి మధ్య కూడా విభేదాలు నెలకొన్నాయి.

Next Story