పాఠశాల విద్యాశాఖపై తప్పుడు కథనాలు.. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అధికారిక వివరణ

by Ramesh Naini |

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన డిజిటల్ విద్యా సంస్కరణలపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యా శాఖ స్పష్టం చేసింది.

పాఠశాల విద్యాశాఖపై తప్పుడు కథనాలు.. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అధికారిక వివరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన డిజిటల్ విద్యా సంస్కరణలపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యా శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. ఎక్స్‌స్టెప్ ఫౌండేషన్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఆర్థికేతరమైనవి (Non-financial). విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన కంటెంట్ అందించడమే లక్ష్యం తప్ప, ఎవరి వద్ద నుండి ఒక్క రూపాయి వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

డిజిటల్ మౌలిక సదుపాయాలు

ఇప్పటికే 19,800 ట్యాబ్‌ల పంపిణీ, 17,875 ఇంటరాక్టివ్ బోర్డుల ఏర్పాటు, 3,565 కంప్యూటర్ ల్యాబ్‌లను విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు FRS (ఫేషియల్ రికగ్నిషన్) హాజరు విధానం అమలు. KGBVలలో 93 పాఠశాలలను 'ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్'గా మార్చి, ఉచితంగా IIT/NEET శిక్షణ అందిస్తోంది. DSC 2024 ద్వారా 10,006 మంది కొత్త ఉపాధ్యాయుల నియామకం చేపట్టింది. మధ్యాహ్న భోజన పథకం, ఇతర బిల్లుల కోసం ఆన్‌లైన్ బిల్లింగ్ విధానం ప్రవేశపెట్టి పారదర్శకత పెంచింది. ‘తప్పుడు సమాచారం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులలో అయోమయం నెలకొనే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉంది, ఎవరైనా క్షేత్రస్థాయిలో పురోగతిని స్వయంగా పరిశీలించవచ్చు’అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి విద్యా సంస్కరణలకు ఆటంకం కలిగించవద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ వివరాలను ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఎక్స్ (@FactCheck_TG) వేదికగా అధికారిక వివరణ ఇచ్చింది.

Next Story