రాష్ట్రపతితో ముఖాముఖి.. ఇఫ్లూ పరిశోధకుడికి అరుదైన అవకాశం

by Taduka Kalyani |

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన పరిశోధక విద్యార్థి రామావత్ మునిలాల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో ప్రత్యక్షంగా సమావేశమయ్యే అరుదైన అవకాశం లభించింది.

రాష్ట్రపతితో ముఖాముఖి.. ఇఫ్లూ పరిశోధకుడికి అరుదైన అవకాశం
X

దిశ, సికింద్రాబాద్ : ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)కి చెందిన పరిశోధక విద్యార్థి రామావత్ మునిలాల్‌కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో ప్రత్యక్షంగా సమావేశమయ్యే అరుదైన అవకాశం లభించింది. ఇఫ్లూ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో రెండో సంవత్సరం పీహెచ్‌డీ పరిశోధన చేస్తున్న మునిలాల్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘జన్ జాతీయ గరిమ ఉత్సవ్ – బిర్సా లైవ్స్ ఇన్ న్యూ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంపికైన గిరిజన విద్యార్థులు, పరిశోధకులతో కలిసి రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన మునిలాల్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతో ముఖాముఖి సంభాషణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ మ్యూజియంను సందర్శించి భారత రాష్ట్రపతి వ్యవస్థ చరిత్ర, వివిధ రాష్ట్రపతులకు లభించిన అరుదైన బహుమతులు, జ్ఞాపికలు, పురస్కారాలను పరిశీలించారు. గిరిజన తండాలో జన్మించిన మునిలాల్‌కు ఈ అనుభవం జీవితంలో మరపురాని ఘట్టంగా నిలిచింది. తొలిసారిగా విమాన ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకున్న ఆయన, దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు, పరిశోధకులతో మమేకమవడం, రాష్ట్రపతితో ప్రత్యక్షంగా మాట్లాడడం తన విద్యా ప్రస్థానంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మునిలాల్ మాట్లాడుతూ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల విద్యార్థుల్లో ఉన్నత విద్య, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం తనలో సమాజాభివృద్ధి కోసం మరింత కృషి చేయాలనే సంకల్పాన్ని బలోపేతం చేసిందని తెలిపారు. గిరిజన యువత పెద్ద కలలు కనాలని, కష్టపడి ముందుకు సాగి తమ సమాజం, దేశాభివృద్ధికి సేవలందించాలని పిలుపునిచ్చారు.

Next Story