సర్కారు ఆదాయానికి గండి.. బడా ఏజెన్సీల దందా

by Naga Rani Yarlagadda |

అక్రమ హోర్డింగులను అరికట్టి.. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త అడ్వర్టైజ్మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది.

సర్కారు ఆదాయానికి గండి.. బడా ఏజెన్సీల దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో : కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో అక్రమ హోర్డింగులను అరికట్టడానికి, ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం నూతన అడ్వర్‌టైజ్‌మెంట్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో విధివిధానాలు, కేటగిరీల వారీగా ఫీజులు, రెగ్యులరేటరీ కమిటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫెనాల్టీల విధింపు వంటివాటిని రూపొందిస్తూ ప్రభుత్వం జీవో నం.84ని జారీ చేసింది. కానీ నెలరోజులైనా కొత్త పాలసీ ఎక్కడా అమలు కావడంలేదు. పైగా పాలసీ రాకముందు కన్నా వచ్చిన తర్వాతే అక్రమ హోర్డింగుల దందా పెరిగిపోయింది. ఏకంగా బడా ఏజెన్సీల ప్రతినిధులు రేటుకట్టి దందా చేస్తున్నా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతున్నది.

ఇల్లీగల్ దందా..

కొత్త అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీ వచ్చినా అనుమతిలేకుండా దందా సాగుతోంది. ఏకంగా ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించడంతోపాటు చోటామోటా ఏజెన్సీల నుంచి బడా ఏజెన్సీలకు సంబంధించిన వ్యక్తులు వసూలు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (టోమో) కోర్ కమిటీ పేరుతో ఏకంగా రేట్లు నిర్ణయించింది. హోర్డింగ్ రూ.10 వేలు, యునిపోల్ రూ.50 వేలు, ఆర్చ్/క్యాంటీ లేవర్ రూ.15 వేలు, బస్‌షెల్టర్ రూ.5 వేలు, లాలిపప్ రూ.1500 చెల్లించి వ్యాపారాలను కొనసాగించుకోవాలని సూచించినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై చిన్న ఏజెన్సీల ప్రతినిధులు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు.

ఏఆర్సీ ఎక్కడ?

కొత్త అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం అడ్వర్‌టైజ్‌మెంట్ రెగ్యులేటరీ కమిటీ (ఏఆర్సీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు జీవో నంబర్ 84లో పేర్కొన్నది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లతోపాటు హెచ్ఎండీఏ కమిషనర్, పోలీసు కమిషనర్ (ట్రాఫిక్), హెచ్ఎంఆర్ఎల్, టీజీఆర్టీసీ, టూరిజం శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. అయితే పాలసీ వచ్చి నెలరోజులు గడిచినా కమిటీ పని చేయడంలేదనే విమర్శలూ లేకపోలేదు. అయితే ఒక సీఎంసీ పరిధిలోనే అనుమతిలేని అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా లేకపోవడంతో అనుమతిలేని అడ్వర్‌టైజ్‌మెంట్ దందా సాగుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సర్కారు ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకోవాలని చిన్న ఏజెన్సీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రూ.కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టే ప్రకటనల పాలసీ అటకెక్కించకుండా వెంటనే గాడిలో పెట్టాల్సిన అవసరముంది. అడ్వర్‌టైజ్‌మెంట్ పాలసీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

2020లో నిషేధం

గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో హోర్డింగులు, యునిపోల్స్‌పై జీహెచ్ఎంసీ వ్యాపార ప్రకటనలు కొనసాగేవి. గతంలో గాలికి హోర్డింగులు పడి ప్రమాదాలు జరగడంతో హోర్డింగులు, యునిపోల్స్‌పై జీహెచ్ఎంసీ 2020లో నిషేధం విధించింది. నిషేధంతో తాము నష్టపోతున్నామని, హోర్డింగులపై కోట్లాది రూపాయలు పెట్టామని కోర్టును ఆశ్రయించారు. ఆ తరువాత కొత్త పాలసీపై ప్రయత్నాలు జరిగాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదలు రెడీ అయినప్పటికీ పాలసీ మాత్రం తీసుకురాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పాలసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త పాలసీ వచ్చిన తర్వాత అక్రమ హోర్డింగులపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.

Next Story