ఆ మూడు శాఖల్లో ఎక్స్‌టెన్షన్ల జోరు..! రిటైర్ అయినా కదలని ఉన్నతాధికారులు

by Kema Shiva Kumar |

ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్‌ శాఖల్లో వింత ఒరవడి సాగుతోంది.

ఆ మూడు శాఖల్లో ఎక్స్‌టెన్షన్ల జోరు..! రిటైర్ అయినా కదలని ఉన్నతాధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్‌ శాఖల్లో వింత ఒరవడి సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పొంది పలు హోదాల్లో ఏండ్ల పాటు పని చేసి రిటైర్‌‌మెంట్ అయిన వారు మళ్లీ అదే పోస్టులో కొనసాగుతున్నారు. అంతే కాదు పలువురికి ప్రమోషన్లు సైతం లభిస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి ఉద్యోగులు, ప్రమోషన్ల లిస్టులో ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వారినే కొనసాగిస్తూ పోతే భవిష్యత్‌లో తమకు ప్రమోషన్లు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్అండ్‌బీలో ఎక్స్‌టెన్షన్..

ఆర్అండ్‌బీ (ఎన్‌హెచ్) విభాగంలో ఎస్ఈగా పని చేసిన ఓ అధికారి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. అయితే తర్వాత ఆయనకే ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. దీంతో ఆ స్థానానికి ప్రమోషన్‌పై రావాల్సిన మరో అధికారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే (రిటైర్ట్) అధికారికి చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా ప్రమోషన్ కల్పించేందుకు రంగం సిద్ధమైంది. పెద్దగా పనిమంతుడు కాదని పేరున్న సదరు అధికారి రాజకీయ అండదండలతో ఇన్నాళ్లూ తన పదవిని కాపాడుకున్నాడని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ చేసుకోవడంతో పాటు ఏకంగా ప్రమోషన్ సైతం పొందేందుకు మార్గం సుగమం చేసుకోవడం ఆ శాఖ ఇంజినీర్లలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది. ఇదే శాఖలో సెప్టెంబర్‌లో రిటైర్డ్ అయిన ఓ ఈఈ రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రికి దగ్గరి బంధువు. దీంతో ఆయన పొలిటికల్‌గా చక్రం తిప్పి అదే పోస్టులో కొనసాగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

పీఆర్, ఇరిగేషన్ శాఖల్లోనూ అదే తంతు

పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్‌గా పని చేసి గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందిన పీ.జోగారెడ్డికి ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే తంతు నీటిపారుదల శాఖలోనూ కొనసాగింది. ఇరిగేషన్‌ ఈఎన్సీ‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన అనిల్‌కుమార్‌కు సైతం ఇదే తరహాలో రిటైర్‌మెంట్ అయిన రోజే కరీంనగర్‌ ఈఎన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ ప్రమోషన్లు మాటేంటి..

ఇలా రిటైర్డ్ అయిన వాళ్లను తిరిగి నియమించుకొని, ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే తమ పరిస్థితి ఏంటని ఆర్‌అండ్‌బీ శాఖలో పని చేస్తున్న ఇంజినీర్లు.. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. రిటైర్డ్ అయిన వారిని తిరిగి నియమించడం ద్వారా శాఖలో అవినీతి పెరుగుతుందని, ఇలా పైరవీలతో కొనసాగే వారికి పెద్దగా రెస్పాన్సిబులిటీ ఉండదని, పై వాళ్లు ఏది చెప్పినా చేసేస్తారని ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. అసలు సమస్య వస్తే ఇబ్బందులు పడేది తామేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదవుల కోసం మరింత మంది ప్రయత్నాలు

ఆర్‌అండ్‌బీలో మరింత మంది రిటైర్డ్ ఉద్యోగులు పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. ఇది శాఖలోని యువ ఇంజినీర్ల భవిష్యత్తును ప్రభావితం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి ఈ తతంగాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలా వారికే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతే కింది స్థాయిలో పని చేస్తున్న తమ పరిస్థితి ఏంటని, తమకు ఇక భవిష్యత్‌లో పదోన్నతులు రావని వారు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story