ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం.. లారీని ఢీకొట్టిన కరీంనగర్ డిపో బస్సు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-22 02:53:45  IST  )

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు చేస్తున్న ప్రయోగాలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్ల ప్రయోగం.. లారీని ఢీకొట్టిన కరీంనగర్ డిపో బస్సు
X

దిశ, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతున్న వేళ అధికారుల అతి ఉత్సాహం సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. ఎలాగైనా బస్సులు నడపాలన్న పంతంతో అనుభవం లేని ప్రైవేటు వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించడంతో మృత్యుశకటాలు రోడెక్కుతున్నాయి. తాజాగా కరీంనగర్ (Karimngar) జిల్లా అల్గూనూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో అధికారులు ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దించారు. కరీంనగర్-2 డిపోకు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి, ఒక ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్‌కు పంపారు. అయితే, అల్గూనూర్ వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం..

కనీస డ్రైవింగ్ అనుభవం లేని వాళ్లకు బస్సులు ఇస్తే మా ప్రాణాలు ఏమవ్వాలని ప్రయాణికులు అధికారులను నిలదీస్తున్నారు. కేవలం సమ్మెను నీరుగార్చడం కోసమే ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తోందని పలువురు ఆరోపింస్తున్నారు.

Next Story