పూర్వ వీఆర్వోల ఎదురుచూపులు..! నియామకాలపై రాని స్పష్టత

by Kema Shiva Kumar |

గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

పూర్వ వీఆర్వోల ఎదురుచూపులు..! నియామకాలపై రాని స్పష్టత
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం ‘రెవెన్యూ’లో పని చేయాలనే ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్వోల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. అయితే దసరా, దీపావళి, ప్రజాప్రభుత్వ వార్షికోత్సవం, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పినా.. నియామకాల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు. దీంతో పూర్వ వీఆర్వోలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కేసీఆర్ హయాంలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి.. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ వీర్వోలను రెవెన్యూలో తీసుకోవాలంటే ‘రాత పరీక్ష’ ఉత్తమమని మెలిక పెట్టినట్టు చర్చ జరురుగుతున్నది. మరోవైపు ఎగ్జామ్ తప్పనిసరా.. శిక్షణ ఇస్తే సరిపోతుందా? అనే కోణంలోనూ సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

ఆప్షన్లు తీసుకున్నా..

రెవెన్యూ శాఖలోకి రావాలనే ఆసక్తి ఉన్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి గత డిసెంబర్ 23-28 మధ్యలో ప్రభుత్వం ఆప్షన్లు తీసుకున్నది. 10,594 రెవెన్యూ గ్రామాలకు సిబ్బంది అవసరమని ప్రభుత్వం ప్రకటించగా.. సుమారు 3500 మంది పూర్వ వీఆర్వోలు అర్జీ పెట్టుకున్నారు. అయితే వీరందరికీ రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందని రెవెన్యూ మంత్రి ప్రకటించారు. ఆ తర్వాత అనుకున్నంత పురోగతి కనిపించ లేదు. అయితే పరీక్ష నిర్వహణ, సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతోనూ సంప్రదింపులు దాదాపుగా కొలిక్కి వచ్చినట్లుగా ఓ ఉన్నతాధికారి ‘దిశ’కు తెలిపారు. ఎలాంటి ప్రశ్నలు ఉండాలన్న దానిపై కసరత్తు చేసినట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో పని చేసేందుకు అవసరమైన డ్రాఫ్ట్ రాసే అవగాహన, జ్ఞానం ఉండేలా.. అంటే కనీసం పంచనామా రాయగలిగేలా ఉద్యోగి ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది.

‘ఎగ్జామ్స్’ నిర్ణయంపై వ్యతిరేకత..

పూర్వ వీఆర్వోల్లో కొందరు 6-24 ఏళ్ల రెవెన్యూ సర్వీసు కలిగి ఉన్నారు. అంతేకాకుండా వేలాది మంది టీఎస్సీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూలోనూ సక్సెస్ సాధించి ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉన్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులై, సుదీర్ఘ అనుభవం కలిగిన తమను మళ్లీ రెవెన్యూలో తీసుకోవడానికి పరీక్ష ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి ఈ విషయాన్ని వివరించారు. సర్వీస్ మ్యాటర్స్ ఎలా ఉన్నా.. పరీక్ష ద్వారానే నియామకాలు అన్నట్లుగా రెవెన్యూ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. అయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటైతేనే తమ సర్వీస్ మ్యాటర్ సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని ఎదురుచూస్తున్న పూర్వ వీఆర్వోలకు నిరాశ తప్పడం లేదు.

శిక్షణతో సరి పెట్టొచ్చా?

ఆప్షన్లు ఇచ్చిన అందరినీ ఒకే లెక్కన పరిగణించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో కామన్ గా పరిగణించాలా? వేర్వేరుగా చూడాలా? అసలు పరీక్ష పెట్టాలా? అందరినీ తీసుకున్న తర్వాత శిక్షణ ఇస్తే సరిపోతుందా? ఇలాంటి అంశాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు. త్వరలో జరగనున్న కేబినేట్ సమావేశంలో అన్ని విషయాలు స్పష్టమవుతాయన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. యథాతథంగా వీరందరినీ తీసుకుంటే ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో పని చేసేవారికైనా పంచనామా, రిపోర్టులు రాయడం వంటి ప్రక్రియలు తెలిసి ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. అధికారాలు, విధులు, బాధ్యతలపై కనీస అవగాహన లేని వారిని నియమించడం ద్వారా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా వెంటాడుతుంది.

ఎందుకీ వివక్ష

పూర్వ వీఆర్ఏల్లో విద్యార్హత ఆధారంగా ఏకంగా ఒక్కొక్కరికి డబుల్ ప్రమోషన్ సైతం ఇచ్చారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి రెగ్యులరైజ్ చేశారు. తమ విషయంలోనే ఎందుకు రాత పరీక్ష పేరుతో ఈ వివక్ష అని పూర్వ వీఆర్వోలు వాపోతున్నారు. ఇటీవల రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్ల పదోన్నతుల సందర్భంగా సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేయగా జోన్ 6లో 140 మందిలో సుమారు 110 మంది వీఆర్ఏలు, అటెండర్, రికార్డ్ అసిస్టెంట్, వాచ్ మన్ వంటి హోదాల నుంచి పదోన్నతి, కారుణ్య నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్ అయ్యారు. వారిలో కొందరు పదవీ విరమణకు సైతం దగ్గరలో ఉన్నారు. వారికి ఇన్నేళ్ల సర్వీసులో ఎలాంటి విద్యార్హతలు ఉన్నాయని పూర్వ వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. ఒకే శాఖలో ఒకే హోదా కలిగిన పోస్టులకు ఇన్ని బేధాలు ఏమిటని వాపోతున్నారు.

జాప్యం వెనక అదృశ్య హస్తం!

అసలు ఈ రాత పరీక్ష అనే విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం అనధికారికంగా తిష్ట వేసిన ఒక ఉన్నతాధికారి అని చర్చ జరుగుతున్నది. సదరు అధికారి కేసీఆర్ పాలనలో ధరణి రూపకల్పనలో మాజీ సీఎస్ సోమేశ్ తో అంటకాగి, పూర్వ వీఆర్వో వ్యవస్థ రద్దుకి కూడా బీజాలు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయి రెవెన్యూ ఏర్పాటులో కూడా రాత పరీక్ష పేరుతో ఉద్దేశపూర్వక మెలికలు పెట్టి జాప్యం చేయడం వల్ల ప్రజాసేవల్లో ఆలస్యం జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడానికీ ప్రయత్నిస్తున్నారని రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ నిర్ణయాలతో నష్టపోయిన పూర్వ వీఆర్వోలు.. ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి విధి నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తే.. అది పాత ప్రభుత్వ ధరణి తప్పిదాలను వెలికి తీసే ప్రమాదం ఉందని, అది గత పెద్దలకు మరింత ఇబ్బందులు తెచ్చి పెడుతుందని ఆయన ఉద్దేశ్యంగా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజా పాలన ఏర్పడి 14 నెలలు గడిచినా రేషన్ కార్డుల జారీ, ధరణి సమస్యల పరిష్కారం, పింఛను లబ్ధిదారుల ఎంపిక, రైతు రుణమాఫీ, సాగు భూములకు రైతు భరోసా, రోజు వారీ రెవెన్యూ కార్యకలాపాల్లో నెలకొన్న గందరగోళమే దానికి నిదర్శనం అని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో కూడా ప్రతీ రెవెన్యూ శాఖ నిర్ణయాన్ని ఆయన ప్రభావితం చేసి, కీలక సమాచారం ప్రతిపక్షంలోని పెద్దలు, మాజీ బ్యూరోక్రాట్లకి చేరవేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి తహసీల్దార్ల బదిలీలు, రెవెన్యూ ఉన్నతాధికారుల పదోన్నతులు, పోస్టింగ్స్ విషయంలో కూడా సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. పైకి నిజాయితీపరుడిలా కనిపించినా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భూసేకరణలో అసైన్డ్ భూముల్లో అనుభవదారులకు పరిహారం చెల్లింపు పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విలువైన విల్లాలు, భూములు, ఓపెన్ ప్లాట్లు కూడబెట్టారని అంటున్నారు. అలాంటి అధికారుల మాటలు వింటే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

Next Story