సింగరేణి నిలదొక్కుకోవాలంటే విస్తరణే మార్గం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Naga Rani Yarlagadda |

ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగ‌రేణి నిల‌దొక్కుకోవాలంటే ఇత‌ర రాష్ట్రాల్లో కొత్త బ్లాకుల‌ను సాధించాల‌ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంస్థ యాజ‌మాన్యానికి దిశానిర్దేశం చేశారు.

సింగరేణి నిలదొక్కుకోవాలంటే విస్తరణే మార్గం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X
  • ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలి
  • కోల్ బెల్ట్ సమస్యలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగ‌రేణి నిల‌దొక్కుకోవాలంటే ఇత‌ర రాష్ట్రాల్లో కొత్త బ్లాకుల‌ను సాధించాల‌ని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క... సంస్థ యాజ‌మాన్యానికి దిశానిర్దేశం చేశారు. అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశ‌గా ప్రయ‌త్నాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. సోమ‌వారం హైద‌రాబాద్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ స‌చివాలంలో జ‌రిగిన‌ సింగ‌రేణి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల‌తో జ‌రిగిన స‌మీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, సీత‌క్క, ఎన‌ర్జీ స్పెష‌ల్ సెక్రెట‌రీ న‌వీన్ మిట్టల్‌, సింగ‌రేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్‌, సింగ‌రేణి జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ డైరెక్టర్ గౌత‌మ్ పొట్రు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరామ్ నాయక్, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, కోవా లక్ష్మీ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భట్టి పేర్కొన్నారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణితో పాటు, కోల్ బెల్ట్ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున కోల్ బెల్ట్ లో ఇచ్చిన హామీల అమలు విషయంలో త‌మ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించగలిగే కొత్త బ్లాకులను సింగరేణి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఫ్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈనేప‌థ్యంలో కొత్త బ్లాకులు సాధించేలా సింగ‌రేణి త‌గు ప్రణాళిక‌లు రూపొందుకుని ముందుకు సాగాల‌ని సూచించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం సింగరేణికి కొత్త బ్లాకులు సాధించడంలో విఫలమైందన్నారు. 100 ఏళ్ల క్రితం ఇల్లందు ప్రాంతంలోని మారుమూల సింగరేణి గ్రామంలో పుట్టిన సింగరేణిని తమ ప్రభుత్వం నేడు ఒడిశా వరకు విస్తరించేలా చేసిందన్నారు. కొత్త బ్లాకులను సాధించడంతోపాటు నాణ్యమైన బొగ్గును అమ్మడం ద్వారా సింగరేణి సంస్థను కాపాడుకోగ‌ల‌మని ఆయ‌న చెప్పారు.

కోల్ బెల్డ్ ఎమ్మెల్యేల వినతులపై రివ్యూ

ఈ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న సమస్యలను ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు... డిఫ్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సింగరేణి అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి డిఫ్యూటీ సీఎం సూచించారు. దీనిపై ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు సమర్పించే విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో సింగరేణి ప్రాంత కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఇక ముందు కూడా సంస్థ అభివృద్ధికి, సింగరేణి ప్రాంత అభివృద్ధికి ప్ర‌జాప్ర‌భుత్వం కట్టుబడి పని చేస్తుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

Next Story