- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్ నగర్ మేయర్ పదవిపై వీడిన ఉత్కంఠ.. ఆమెకే పట్టం
మహబూబ్ నగర్ మేయర్ పదవీపై నాలుగు రోజులు కొనసాగిన ఉత్కంఠకు నేడు తెరదించుతూ మేయర్ గా మమతను, డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డి పార్టీ ప్రకటించింది.

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పదవిపై కొనసాగిన ఉత్కంఠకు అధిష్టానం ఫుల్‌స్టాప్ పెట్టింది. అనేక పేర్లు చర్చలోకి వచ్చిన నేపథ్యంలో చివరి క్షణంలో 3 వ డివిజన్ లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మమత పేరును ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎన్నిక అనంతరం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ మహిళా రిజర్వేషన్ కేటాయింపుతో మేయర్ పదవి ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేసినప్పటికీ, అధిష్టానం తీసుకున్న నిర్ణయం అనూహ్య మలుపు తిప్పింది. మమత ఎంపిక పార్టీ అంతర్గత సమీకరణలకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక డిప్యూటీ మేయర్ గా సురేందర్ రెడ్డి ఎంపిక మాత్రం మొదటి నుంచి ఊహించినట్టే సాగింది. స్థానిక రాజకీయాల్లో ఉన్న పట్టుదల, పార్టీ కార్యకలాపాల్లో చురుకుదనం ఆయన ఎంపికను సహజ నిర్ణయంగా మార్చాయి. మేయర్ ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి కథ ను సుఖాంతంగా ముగించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ మమత మాట్లాడుతూ, బీసీ మహిళ వర్గానికి దక్కిన ఈ గౌరవాన్ని నగరాభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి బీసీ మహిళా రిజర్వేషన్ లో అనూహ్య ఎంపికగా మమత పేరు, రాజకీయంగా ముందే అంచనా వేసినట్టే సురేందర్ రెడ్డి ల ఎంపిక జరిగింది. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించడంతో నగర పాలనలో కొత్త అధ్యాయం ఆరంభమై పట్టణాభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో వేచిచూడాలి.






