కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుకు తీవ్ర అస్వస్థత

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-09 09:22:01  IST  )

కేంద్రమాజీమంత్రి కావూరి సాంబశివరావు ఆరోగ్య పరిస్థితి విషమించిన స్టార్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని తెలిపాయి.

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావుకు తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు (82) తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపాయి. 1943లో పుట్టిన ఆయన వరంగల్ నిట్ లో డిగ్రీ పొందారు. ఐదుసార్లు ఎంపీగా, ఒక సారి కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు సేవలందించారు. 1984,1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా సేవలందించారు. మొత్తంగా 8,9,12,14,15 లోక్ సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు.

2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. కాగా.. కావూరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. స్వయానా ఈయన కూతురి కొడుకే. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించినట్లు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story