ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం : సిట్ నోటీసులపై హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-20 06:27:49  IST  )

రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు.

ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం : సిట్ నోటీసులపై హరీష్ రావు ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అవినీతి బయటపడిందని సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు వెళ్లేముందు ఆయన తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో పుప్పాలగూడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. నిన్న ఉదయం రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెడితే.. రాత్రి 9 గంటలకు సిట్ నోటీసులు వచ్చాయని, ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారన్నారు. అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రిజల్ట్స్ చూసి రేవంత్ కు దిమ్మ తిరిగిందని, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా బలపడతామన్న భయం సీఎం రేవంత్ రెడ్డిలో మొదలైందన్నారు.

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని హరీష్ రావు తెలిపారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి న్యాయవాదుల్ని పెట్టినా.. న్యాయం తనవైపు ఉందని గెలిచామన్నారు. తాము తప్పు చేయలేదు కాబట్టి ఎవ్వరికీ భయపడమన్నారు. మీడియాను, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించినా వదిలిపెట్టబోమన్నారు. బొగ్గు కుంభకోణం, ఆంధ్రాకు అమ్ముడుపోవడం, పవర్ స్కామ్, అవినీతి బాగోతాలపై నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజల పక్షాల ఆరుగ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సింగరేణిలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఓపెన్ లెటర్ రాశారు. ఈ కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలను ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని, రేవంత్ రెడ్డితో కుమ్మక్కు కాకపోతే దీనిపై సీబీఐ విచారణ జరిపించి, నిజానిజాలను బయటకు తీసి నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి వందలకోట్ల సింగరేణి సొమ్మును తన సోకులకు ఖర్చు చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఒక అక్రమ కేసు అని, రాజకీయాలను డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఆడుతున్న సిల్లీ డ్రామా అన్నారు. ఎన్నిసార్లు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా విచారణకు వెళ్తామన్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.

Read More..

సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు.. తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు

Next Story