స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం.. నేడు సర్కారుకు డెడికేషన్ కమిషన్ నివేదిక

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ నేడు (గురువారం) సర్కారుకు అందజేయనుంది.

స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం.. నేడు సర్కారుకు డెడికేషన్ కమిషన్ నివేదిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ నేడు (గురువారం) సర్కారుకు అందజేయనుంది. ఇప్పటికే ఆ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. అంతకుముందు గ్రామపంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, 50 శాతం రిజర్వేషన్లకు మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం తీర్మానించింది. ఈ క్రమంలోనే 50 శాతం రిజర్వేషన్‌లకు అనుగుణంగా డెడికెటెడ్​కమిషన్​నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది. దీంతో డెడికెటెడ్ కమిషన్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్స్​రిజర్వేషన్​లను లెక్కలను ఖరారు చేసింది. ఈ నివేదికను గురువారం కమిషన్​ చైర్మన్​బూసాని వెంకటేశ్వర్​రావు ప్రభుత్వానికి అందించనున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి జిల్లాలకు అందజేయనుంది. కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్‌లు ఖరారు చేస్తారు.

ఖరారు చేసిన రిజర్వేషన్‌ల గెజిట్‌ను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీనితో పాటే పంచాయతీరాజ్​శాఖ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం తరఫున లేఖ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్​విడుదల చేయనుంది. ఇదిలాఉండగా, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో ఈనెల 24న విచారణ జరగనుంది. దీంతో ప్రభుత్వం నేడో రేపో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మూడు వారాల్లోపు రిజర్వేషన్‌లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ఇస్తామని ప్రభుత్వం చెప్పనుంది. ఎన్నికల నిర్వహణకు సైతం తాము సిద్ధంగా ఉన్నట్టు సర్కారు అఫిడవిట్ లో పేర్కొననుంది. కాగా, హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లనుంది.

Next Story