సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం.. సర్కార్ ముమ్మర ఏర్పాట్లు

by Kema Shiva Kumar |

నదులను దేవతలుగా భావించి, పూజించే సంస్కృతి మన దేశానిది.

సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధం.. సర్కార్ ముమ్మర ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నదులను దేవతలుగా భావించి, పూజించే సంస్కృతి మన దేశానిది. మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞతలు తెలుపుకొనే సాంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వికులు నిర్దేశించారు. తదనుగుణంగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు.. ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. పన్నెండు ప్రధాన నదులకు... పన్నెండేళ్లకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి. మిగిలిన నదుల్లా కాకుండా అంతర్వాహినిగా ప్రవహించడం ఈ నది యెక్క ప్రత్యేకత. రుగ్వేదం, పురాణాల్లో సరస్వతీ నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది. పవిత్రమైన సప్తనదుల్లోనూ సరస్వతికి విశిష్టస్థానం ఉంది. అందుకే, స్నానం చేసినప్పుడు.. ‘గంగే చయమునే చైవ గోదావరీ సరస్వతీ.. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు’... అంటూ ఈ నదులను తలచుకోవడం పుణ్యప్రదమని చెప్పారు పెద్దలు. బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. ఈనెల 15 నుంచి 26 వరకూ పన్నెండు రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరగబోతున్నాయి.

మానా.. సరస్వతి నది జన్మస్థానం

సరస్వతీ నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రినాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామం. అక్కడ కూడా పుష్కర స్నానాల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరస్వతీ నది... అలకనంద నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుందంటారు. అలాగే సరస్వతీ నది అంతర్వాహినిగా.... ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగలో, గుజరాత్ లోని సోమనాథలోని త్రివేణీ సంగమాల్లో, రాజస్థాన్లోని పుష్కరలో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలను నిర్వహిస్తున్నారు.

కాళేశ్వరంలో ఏర్పాట్లు..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం... సరస్వతీ నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. గోదావరి, ప్రాణహిత నదులతో సరస్వతి కలిసే త్రివేణీ సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్ కు ప్రస్తుతం ఉన్న ఘాట్ ను విస్తరిస్తూ సుమారు 86 మీటర్ల వెడల్పుతో నూతన ఘాట్ ను నిర్మించారు. నూతన ఘాట్ పైన 16 అడుగుల ఎత్తయిన సరస్వతి అమ్మవారి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు నది హారతి నిర్వహించడానికి హారతి ఫ్లాట్ ఫాం కూడా నిర్మించారు. సదరు ఘాట్ ను ప్రస్తుతం వీఐపీ ఘాట్ గా పిలుస్తుండగా ఇక నుండి సరస్వతి ఘాట్ గా నామకరణం చేశారు.

Next Story