- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాడితప్పిన వైద్యారోగ్య శాఖ.. బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని.. వైద్య ఆరోగ్య శాఖలో పర్యవేక్షణ, జవాబుదారీతనం లేకపోవడం వల్లే అనేక ఘటనలు జరుగుతున్నాయని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందని.. వైద్య ఆరోగ్య శాఖలో పర్యవేక్షణ, జవాబుదారీతనం లేకపోవడం వల్లే అనేక ఘటనలు జరుగుతున్నాయని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్సల అనంతరం పలువురు బాలింతలు తీవ్ర ఇన్ఫెక్షన్ బారిన పడిన ఘటనపై హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలింతలను, వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్న 10 మంది బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
బాలింతల్లో ముగ్గురి పరిస్థితి విషమం
ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలింతల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని.. తెల్ల రక్తకణాలు తగ్గిపోవడంతో పాటు ఊపిరితిత్తులు, కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకడంతో డయాలసిస్‌పై చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు. ఇంత తీవ్రమైన ఘటన జరిగి పది రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని.. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి బాధితులను పరామర్శించలేదని ఆరోపించారు. ఘటనపై ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు సైతం ఆదేశాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమని పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో లోపాలు, కాలం చెల్లిన మందుల వినియోగం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయని తెలిపారు. తల్లులకు సోకిన ఇన్ఫెక్షన్ పాల ద్వారా పసిపిల్లలకు కూడా చేరడంతో వారు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుస్థితి అత్యంత హృదయ విదారకమని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి వైద్యం, తగిన ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. ఆ చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.






