రంగరాజన్ పై దాడిని ప్రతి ఒకరు ఖండించాలి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

by Muthe.Rajitha |

ప్రజాస్వామ్యంలో దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

రంగరాజన్ పై దాడిని  ప్రతి ఒకరు ఖండించాలి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాస్వామ్యంలో దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా ఒక ప్రకటనలో పేర్కొంటూ వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి బాధాకరమన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్ దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని సూచించారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆయనకుఅన్నిరకాలుగా అండగా నిలబడుతుందని వెల్లడించారు.

హిందూ ధర్మాన్ని కాపాడే వారే హింసకు పాల్పడడం బాధాకరం : బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. హిందూ ధర్మాన్ని కాపాడే వారు హింసకు పాల్పడడం బాధాకరం. ఆలయ అర్చకులపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. హిందూ ధర్మాన్ని కాపాడుతూ దేవాలయ సేవలో ఉన్న వ్యక్తిని హింసించడాన్ని సహించకూడదన్నారు. రామరాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం హింసను ప్రేరేపించే వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏ ఒక్కరి ప్రాణాలకు ముప్పు లేకుండా ప్రభుత్వం వెంటనే దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అర్చకులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని పేర్కొన్నారు. హిందుత్వం అనేది సంస్కారం, శాంతి, సహనం, సత్యం, ధర్మంపై ఆధారపడి ఉంటుంది. హింసకు, బెదిరింపులకు ఇందులో ఎప్పటికీ స్థానం లేదు. రామరాజ్యం స్థాపన అర్చకులపై దాడులతో కాదు, మంచి పాలన, న్యాయం, ధర్మాన్ని పాటించడం ద్వారా సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యంలో రాడికల్ మూమెంట్ కు స్థానం లేదు: వీహెచ్​పీ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడిని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముక్ పగుడాకుల బాలస్వామి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు, దౌర్జన్యాలకు స్థానం లేదని పేర్కొన్నారు. రాడికల్ మూమెంట్ చెల్లదని హెచ్చరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యము కల్పించి, అత్యంత క్రమశిక్షణతో దేవాలయాన్ని నిర్వహించడం రంగరాజన్ ప్రత్యేకత అని వివరించారు. సమాజంలో అంటరానితనాన్ని తుడిచివేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇలాంటి సందర్భంలో వారిపై దాడికి పాల్పడటం అత్యంత హేయమని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన దుండగులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్మం కోసం పనిచేసే సంఘాలు, సంస్థలు చట్టానికి లోబడే పనిచేయాలని.. అప్పుడే రామరాజ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు.

Next Story