బీజేపీ దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకుంటుంది: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్

by Yella Dhawani Reddy |

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకుంటుంది: ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని, పార్లమెంట్ ఎన్నికల లానే బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్ధతు ఇస్తుందని అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేవుడు పేరు చెప్పి బీజేపీ ఓట్లు దండుకోవటం పరిపాటి అయిందని మండిపడ్డారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని బీజేపీ, బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టభద్రులు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రను తిప్పికొట్టి కాంగ్రెస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. బీఆర్ఎస్ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ట్యూషన్ల నుంచి మొదలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి ప్రయాణం విద్యాసంస్థలు నెలకొల్పి వేలమందిని విద్యావంతులను తయారు చేశారని అన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు.

గ్రాడ్యుయేట్ పరిధిలోని నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి.. బడ్జెట్‌లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో రూపాయి తీసుకోరాని బీజేపీ ఎంపీలను నిలదీయాలని అన్నారు. విద్యావేత్తగా నరేందర్ రెడ్డికి నాలుగు ఉమ్మడి (ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్) జిల్లాలపై అవగాహన ఉందని, బీజేపీ అభ్యర్థికి ఇక్కడి పట్టభద్రుల సమస్యలపై అవగాహన లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ ఆశయం మేరకు కుల గణన సర్వే నిర్వహించామన్నారు. బీసీల కోసం చిత్త శుద్ధితో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు.

Next Story