2002 ఓటరు లిస్టులో పేరున్నా తల్లిదండ్రుల వివరాలు కావాల్సిందే

by Malleboina Mahesh |

ఎన్నికల సంఘం అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్ లో ఓటరు వివరాలతో పాటు తాజా వివరాలను పొందుపరచాలని చెబుతున్నారు.

2002 ఓటరు లిస్టులో పేరున్నా తల్లిదండ్రుల వివరాలు కావాల్సిందే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ఎస్ఐఆర్ 2002 లిస్టులో ఓటరు పేరుంటే.. ఎన్నికల సంఘం అందజేసిన ఎన్యూమరేషన్ ఫామ్ లో ఓటరు వివరాలతో పాటు తాజా వివరాలను పొందుపరచాలి. తల్లిదండ్రులకు సంబంధించిన 2002 వివరాలు అవసరం లేదు’ అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ సైతం అనేకమార్లు ఇదే విషయాన్ని చెప్పారు. అంతేకాదు వీఐపీ ఓటర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బీఎల్ఓలను ఆదేశించారు. కానీ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇలాంటి నిబంధనలను కొంత మంది బీఎల్ఓలు బేఖాతరు చేస్తున్నారు. బీఎల్ఓలకు అవగాహన లేకపోవడం ఒకటైతే..కొంత మంది బీఎల్ఓలు కావాలనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

వీఐపీ ఓటరుపై ఒత్తిడి

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ 65 ఏండ్ల వీఐపీ ఓటరుకు సంబంధించిన వివరాలు 2002 ఓటరు లిస్టులో ఉన్నాయి. అయితే సంబంధిత ఓటరుకు చెందిన తల్లిదండ్రుల వివరాలు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ లో చేర్చాలని బీఎల్ఓలు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఓ సీనియర్ అధికారి చెప్పినా వినకుండా.. ఒత్తిడి చేస్తున్నారని సదరు ఓటరు ఆవేదన వ్యక్తంచేశారు. నగరంతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆన్ లైన్ లో ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపినా.. మళ్లీ ఫిజికల్ ఫామ్ కూడా ఇవ్వాలని మరికొంత మంది బీఎల్ఓలు ఒత్తిడి చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా ఎస్ఐఆర్ లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సంఘం నియమించిన బీఎల్ఓలకు అవగాహన కొరవడిందని పలువురు రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ ఏరియాల్లో సైతం అవగాహనలేని వ్యక్తులను బీఎల్ఓలుగా నియమించారని వాపోతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఇలాంటి సమస్య మరీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఏరియాలు తెలియని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను బీఎల్ఓలుగా నియమించడంతో సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయని పేర్కొంటున్నారు.

75.13శాతం పూర్తి..

రాష్ట్రంలోని ఇప్పటి వరకు 75.13శాతం ఎస్ఐఆర్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 3,38,26,448 మంది ఓటర్లకుగాను ఇప్పటి వరకు 2,54,13,878 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారమ్స్ ను అధికారులు డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. ఆగస్టు మూడో తేదీన ప్రక్రియ ముగియనుండగా.. ఆ లోగా 84,12,570 ఫారమ్స్ ను డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అంటే రోజుకు 12 వేలకు పైగా ఫారమ్స్ డిజిటలైజ్ చేయాల్సి ఉన్నది.

ఆందోళనలో ఓటర్లు

అధికారులు, బీఎల్ఓలు చేసిన పొరపాట్లకు తాము ఎక్కడ ఓట్లు కోల్పోవాల్సి వస్తుందేమోనని పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేసిన బీఎల్ఓలు.. వాటిని తిరిగి తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమ్యూనిటీ హాల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కూర్చొని ఎన్యూమరేషన్ ఫారమ్స్ తీసుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. ప్రతి ఓటరు ఇంటికి బీఎల్ఓలు మూడు సార్లు వస్తారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారి కూడా రాలేదనే విమర్శలు లేకపోలేదు. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించినా.. నేటికి పరిస్థితి మారలేదని, ఫలితంగా తమ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందేమోననే ఆందోళనలో ఓటర్లు ఉన్నారు.

Next Story