ఆ మూడు పార్టీలు కలిసినా గ్రేటర్‌లో గెలవరు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

దేశంలో గ్యాస్ కొరత లేదని, ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మబోరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

ఆ మూడు పార్టీలు కలిసినా గ్రేటర్‌లో గెలవరు.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సన్నిధి వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ గ్యారంటీలపై విమర్శలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం కేవలం ఫోటోలకే పరిమితమైందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ కొరతపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని భరోసా ఇచ్చారు. ‘మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ప్రపంచ పరిణామాలు అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇరాన్ నుంచి ఇండియాకు చమురు నౌకలు వస్తున్నాయి. గ్యాస్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మరు’ అని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ సమీకరణాలు..

గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమైనా బీజేపీని ఓడించలేవని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు ఖాయమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం అన్నారు.

Next Story