- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Oil: బ్యారెల్‌కు 90 డాలర్లు దాటిన బ్రెంట్ చమురు
గత వారం కూడా బ్రెంట్ దాదాపు 16 శాతం, డబ్ల్యూటీఐ 15.5 శాతం లాభపడటం, ఈ ధరల పెరుగుదల కేవలం తాత్కాలికం కాదనే సంకేతాలను ఇస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరడంతో ప్రపంచ చమురు మార్కెట్లు మరోసారి ఒత్తిడిలోకి వెళ్లాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణాపై ఆందోళనలు పెరగడంతో సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 90 డాలర్లను దాటింది. బ్రెంట్ ఫ్యూచర్స్ 2.37 శాతం పెరిగి 90.19 డాలర్లకు, అమెరికా బెంచ్‌మార్క్ డబ్ల్యూటీఐ క్రూడ్ 2.07 శాతం పెరిగి 84.20 డాలర్లకు చేరాయి. గత వారం కూడా బ్రెంట్ దాదాపు 16 శాతం, డబ్ల్యూటీఐ 15.5 శాతం లాభపడటం, ఈ ధరల పెరుగుదల కేవలం తాత్కాలికం కాదనే సంకేతాలను ఇస్తోంది. అమెరికా వరుసగా తొమ్మిదో రోజు ఇరాన్‌పై దాడులు కొనసాగించగా, కువైట్, బహ్రెయిన్ వంటి అమెరికా మిత్రదేశాలపై కూడా ఇరాన్ దాడులు జరిగినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయి నిలిచిపోయాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఈ ఘటనతో చమురు రవాణా భద్రతపై ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20 శాతం ఈ జలసంధి గుండా సాగుతుండటంతో, ఇక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా అంతర్జాతీయ ధరలపై వెంటనే ప్రభావం పడుతోంది. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచ చమురు నిల్వలు గత ఐదేళ్లలోనే కనిష్ఠ స్థాయిలో ఉండటంతో, సరఫరాలో అంతరాయం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్ ఎస్ ఈజీ డేటా ప్రకారం, ఆదివారం హోర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల సంఖ్య కూడా తగ్గడం మార్కెట్ ఆందోళనలను మరింత పెంచుతోంది. ఈ ప్రభావం కారణంగా సోమవారం ట్రేడింగ్ లో భారతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతేకాకుండా గ్లోబల్ ఈక్విటీల నుంచి కూడా ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా మార్కెట్లను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ ఇండెక్స్ 442.93 పాయింట్లు కోల్పోయి 77, 708 వద్ద, నిఫ్టీ 95.80 పాయింట్లు నష్టపోయి 24,238 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 96.43 వద్ద ఉంది.






