కేంద్రం కొనకపోయినా.. రూ.4 వేల కోట్లతో మొక్కజొన్న సేకరణ: మంత్రి తుమ్మల

by Ramesh Naini |

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

కేంద్రం కొనకపోయినా.. రూ.4 వేల కోట్లతో మొక్కజొన్న సేకరణ: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇప్పటి వరకు 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం రూ.4 వేల కోట్ల వ్యయంతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టిందన్నారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సౌకర్యాలు, గన్నీ బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జొన్న పంటను కూడా రూ.1,000 కోట్లతో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం మొత్తం 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉందని, దీంతో ఇంకా 3.29 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు గోదాములను వెంటనే గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

కొనుగోళ్ల కోసం 3 కోట్ల గన్నీ బ్యాగులు!

మొక్కజొన్న కొనుగోళ్ల కోసం 3 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతుండగా, ఇప్పటివరకు 2 కోట్ల గన్నీ బ్యాగులు సరఫరా చేసినట్లు, మిగిలిన ఒక కోటి గన్నీ బ్యాగులు వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అప్‌లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని, రైతులు తీసుకొచ్చిన పంటను ఆలస్యం లేకుండా బరువు తూచి, గోదాములకు తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై అమలులో ఉన్న 25 శాతం సీలింగ్‌ను 50 శాతానికి పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.

Next Story