Ponnam Prabhakar: వాహనదారులకు రూ.వెయ్యి కోట్ల ప్రయోజనం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కాలుష్య రహిత, ఆధునిక రవాణా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Ponnam Prabhakar: వాహనదారులకు రూ.వెయ్యి కోట్ల ప్రయోజనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాలుష్య రహిత, ఆధునిక రవాణా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో రవాణా శాఖ, ఎలెట్స్ టెక్నోమీడియా సంయుక్తంగా నిర్వహించిన ‘సెకండ్ నేషనల్ మొబిలిటీ సమ్మిట్- 2026’ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2026 చివరి వరకు 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులను మాఫీ చేశామని, దీని ద్వారా ఇప్పటికే వాహనదారులకు రూ. 1,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 810 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా... 2027 నాటికి హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో వీటి సంఖ్యను 2,800కు పెంచడమే లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సులకు సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజా రవాణాలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడంపై కూడా దృష్టి సారించామని.. ఇది ఉద్గారాలను గణనీయంగా తగ్గించి.. గాలి నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు.

క్లీన్ ఎనర్జీలో భాగంగా 20,000 ఎలక్ట్రిక్ ఆటోలు, 10,000 సీఎన్‌జీ, 10,000 ఎల్‌పీజీ ఆటోలకు కొత్తగా పర్మిట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ఢిల్లీ వంటి నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఇంధన పొదుపు, గ్రీన్ ఎనర్జీ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'విజన్ 2047'లో భాగంగా స్మార్ట్ మొబిలిటీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామన్నారు. విద్యుత్ వాహనాల పెంపు ద్వారా కాలుష్యాన్ని నివారించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ నేషనల్ మొబిలిటీ సమ్మిట్ ప్లాట్‌ఫారమ్‌లు ఆవిష్కరణ, అమలును వేగవంతం చేసే భాగస్వామ్యాలను సృష్టించడంలో సహాయపడతాయన్నారు. ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, స్థిరమైన రవాణా వ్యవస్థలకు మద్దతు ఇవ్వడానికి తమ సర్కారు కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story