- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నీ ఉత్తరాదికేనా?.. మాకు ఏఐఐఏ ఏర్పాటు చేయండి.. కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దేశ ఆరోగ్య రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దేశ ఆరోగ్య రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2014 నవంబర్ 9న ఈ శాఖ స్వతంత్ర విభాగంగా ఏర్పడింది. ఇందులో ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యూనాని, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య విధానాలున్నాయి. ఆయుష్ పరిధిలోని ఆయుర్వేదంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపించడంలేదు. యోగాను గొప్పగా ప్రమోట్ చేస్తున్న కేంద్రం.. ఆయుర్వేద వైద్యానికి మాత్రం సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేయడం లేదనే ఆరోపణలున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం
తెలంగాణలో ఆయుర్వేద విద్య, పరిశోధనా సంస్థ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. 2030 నాటికి దేశంలో 10 ఆల్ ఇండియా ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్స్ ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఒకటి తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.
ఎయిమ్స్ తరహాలో.. ఏఐఐఏ
నేషనల్ ఆయుష్ మిషన్ (నామ్) ద్వారా దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్య కేంద్రాలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్రం చెబుతోంది. ఆయుష్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ ద్వారా గ్రామీణ స్థాయికి ఆయుష్ సేవలు చేరుతున్నాయని వివరిస్తోంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఒక అపెక్స్ సంస్థ. ఈ కేంద్రాలు ఆయుర్వేద విద్య, పరిశోధన, ఉన్నత స్థాయి చికిత్సలకు అత్యుత్తమ వేదికలుగా ఉంటాయి. అయితే ఇవి కేవలం ఢిల్లీ, గోవాలో మాత్రమే ఉన్నాయి. ఢిల్లీలో ఎండీ ఆయుర్వేద, పోస్ట్-గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ కోర్సులు, కాయచికిత్స, పంచకర్మ, శల్య తంత్రం వంటి 12కి పైగా విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తాయి. సాంప్రదాయ చికిత్సలతో పాటు ఆధునిక రోగ నిర్ధారణ సౌకర్యాలుంటాయి. పరిశోధన, ఆయుర్వేద ఔషధాల నాణ్యత ధృవీకరణ, అంతర్జాతీయ సహకారంతో క్లినికల్ పరిశోధనలకు కేంద్రంగా పనిచేస్తాయి.
జైపూర్ కేంద్రంగా ఎన్ఐఏ
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంతో పాటు దాని అనుబంధ సంస్థగా హర్యానాలోని పంచకులలోనూ ఓ శాటిలైట్ సెంటర్ పని చేస్తున్నాయి. ఇవి ఆయుర్వేద వైజ్ఞానిక, విద్యా, వైద్య సేవలుగా పని చేస్తున్నాయి. ఇందులో బీఎఎంఎస్ నుంచి పీహెచ్‌డీ వరకూ విద్యావకాశాలు, వైద్యం అందుతాయి. ఇక్కడ పురాతన తాలప్రతులను డిజిటలైజేషన్ సైతం చేస్తారు.
అన్నీ ఉత్తరాదికేనా..
జైపూర్, ఢిల్లీ, పంచకుల, గోవా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. గోవా తరహాలో తెలంగాణలోనూ ఏఐఐఏ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రానికే కాకుండా దక్షిణాదికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు ఇక్కడి నుంచి ఉన్నత స్థాయి ఆయుర్వేద చికిత్స కోసం ఢిల్లీ, గోవాకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొంటున్నారు. మరో వైపు సంస్థ ఏర్పాటు వల్ల వందలాది మంది ఆయుర్వేద వైద్యులకు, పరిశోధకులకు, పారామెడికల్ సిబ్బందికి ఉపాధి సైతం లభిస్తుందని, విద్యార్థులకు స్థానికంగానే జాతీయ స్థాయి పోస్ట్-గ్రాడ్యుయేట్, డాక్టోరల్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని పలువురు వైద్యులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఏఐఐఏ ఏర్పాటు చేయండి
తెలంగాణకు ఏఐఐఏ మంజూరు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఏఐఐఏ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్, ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌కు లేఖ సైతం రాశారు. ఈ లేఖను శనివారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌కు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు అందజేశారు. ఇక్కడి అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉందని, మెడిసినల్ వాల్యూస్ ఉన్న మూలికలు, మొక్కల జాతులు సైతం ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంప్రదాయ ఆయుర్వేద వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవలే సుమారు 800 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను సైతం నియమించినట్టు లేఖ ద్వారా వివరించారు. ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.






