నిమ్స్‌ ఆసుపత్రికి డోనేషన్‌గా రూ.33 లక్షల విలువైన పరికరాలు

by Ajay Maddhiboyina |

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) నిమ్స్ ఆసుపత్రికి రూ.33 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ బగ్గీలు, హ్యాండ్ థెరపీ పరికరాలను అందజేసింది.

నిమ్స్‌ ఆసుపత్రికి డోనేషన్‌గా రూ.33 లక్షల విలువైన పరికరాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) నిమ్స్ ఆసుపత్రికి రూ.33 లక్షల విలువైన రెండు ఎలక్ట్రిక్ బగ్గీలు, హ్యాండ్ థెరపీ పరికరాలను అందజేసింది. ఈ పరికరాలను టీజీఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, వైస్ చైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం.భగవత్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. బీరప్ప సమక్షంలో ప్రారంభించారు. నిమ్స్ క్యాంపస్‌లో రోగులు, వృద్ధులు, ఆసుపత్రి సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేందుకు ఎలక్ట్రిక్ బగ్గీలు ఉపయోగపడనున్నాయి. అలాగే చేతులు, పై అవయవాల చికిత్స పొందుతున్న రోగుల పునరావాస సేవలను మెరుగుపరచడంలో హ్యాండ్ థెరపీ పరికరాలు దోహదం చేయనున్నాయి.

ఈ సందర్భంగా టీజీఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం భగవత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య సంస్థలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు టీజీఎఫ్‌డీసీ ప్రాధాన్యం ఇస్తోందని, ఈ విరాళం ద్వారా రోగుల సౌకర్యాలు, వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా సామాజిక, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీజీఎఫ్‌డీసీ చీఫ్ జనరల్ మేనేజర్ డి.వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) డాక్టర్ జి. స్కైలాబ్, జనరల్ మేనేజర్ (విజిలెన్స్) సయ్యద్ మక్సూద్, ఫైనాన్షియల్ కంట్రోలర్ ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story