- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీసీయూఆర్ అంతా జీహెచ్ఎంసీలోకే
హైదరాబాద్ మహా నగరం విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహా నగరం విస్తరణ, అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ కేబినెట్ సమావేశం నిర్ణయించింది. దీంతోపాటు జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో విలీనానికి సంబంధించిన అంశాన్ని టేబుల్ ఎజెండాగా చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనలో విలీన మున్సిపాలిటీలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీంతో 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ ఏరియా 2,052 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
2007లో జీహెచ్ఎంసీగా
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్ఎంసీ) 1933లో చాదర్‌ఘాట్ ము న్సిపాలిటీని విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. 1934లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. తర్వాత 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 12 శివారు మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఏర్పాటు చేసింది. దీంతో 625 చదరపు కిలోమీటర్లకు జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెరిగింది. అప్పటి నుంచి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టం-1955 గా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 67 లక్షలకు పైగా ఉండగా, ప్రస్తుతం జనాభా కోటి పైగానే ఉంటుంది.
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంతా
ఓఆర్ఆర్ లోపల ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(టీసీయూఆర్)ను అంతా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదంతో
27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. అయితే విలీన ప్రతిపాదనను మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. దీనిపై ఎలాంటి సమాచారం లేదని మేయర్ పోడియం వద్ద ఆందోళన చేశారు. అంతలోనే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.
పట్టణాభివృద్ధి.. ప్రణాళికబద్ధంగా..
శివారు మున్సిపాలిటీల్లో అభివృద్ధి వ్యత్యాసాలు, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడి వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావిస్తూ, పట్టణాభివృద్ధిలో తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో విలీనం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
విలీనమైన పట్టణ స్థానిక సంస్థలు
జీహెచ్ఎంసీలో విలీనం చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి లో బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగుడ జా గీర్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నా ర్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, ద మ్మాయిగూడ, నాగారం, పొచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బోల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి.
ఆడిట్, బడ్జెటరీ అంశాలపై
27 మున్సిపాలిటీలను విలీనం చేయడానికి ముందు సంబంధిత మున్సిపాలిటీల్లో ఆడిట్, బడ్జెటరీ అంశాలపై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసి రిపోర్టు తయారు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య, వేతనాలకయ్యే ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన బడ్జెట్ వివరాలు సేకరించారు. ఆయా మున్సిపాలిటీల్లో వస్తున్న ఆదాయం, చేస్తున్న ఖర్చులను ప్రత్యేకంగా పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఇదివరకే అందజేశారు.
ఒకే గొడుగు కిందకు
రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలతో కలిపి 160 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దవిగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ 1955 చట్టం, మున్సిపాలిటీల చట్టం 2019 రెండు వేరువేరుగా ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలో పంచాయతీ రాజ్ చట్టం, హెచ్ఎండీఏ చట్టం నాలుగు రకాల చట్టాలు ఉన్నాయి. వీటన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.
దీంతోపాటు తెలంగాణలో ఒకే మున్సిపల్ చట్టం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం పెంచిన ప్రభుత్వం ముంబై, ఢిల్లీ తరహా మూడు లేదా నాలుగు కార్పొరేషన్లు చేయాలని చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీజీఐఐసీ, పంచాయతీరాజ్ అన్నింటికి యూనిఫైడ్ డెవలప్‌మెంట్ బిల్డింగ్ కోడ్ (యూడీబీసీ) తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ చివరి దశలో ఉన్నది.






