తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు.. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-06 08:46:44  IST  )

తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 2025-26 నుంచి 2027-28 బ్లాక్ పీరియడ్ కోసం BE/B.Tech ట్యూషన్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు.. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్‌-ఎయిడెడ్ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ (B.E./B.Tech) కోర్సులకు సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2027-28 వరకు వర్తించే ఈ కొత్త ఫీజులపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా జీవో నెం.06‌తో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తాజాగా నిర్ణయించి ఫీజులు 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరానికి వర్తించనున్నాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సమర్పించిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ ఫీజులను నిర్ణయించింది. ఖరారు చేసిన ట్యూషన్ ఫీజులో అడ్మిషన్ ఫీజు, ఇతర ప్రత్యేక ఫీజులు కలవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఇలా..

ప్రభుత్వం విడుదల చేసిన అనుబంధ జాబితా ప్రకారం చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT)‌లో రూ.1,83,000, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (VASV)లో రూ.1,75,000, మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MGIT)లో రూ.1,67,000, సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (CVR)లో రూ.1,63,00, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ (VJEC): రూ.1,59,600, బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRI)లో రూ.1,46,600గా నిర్ణయించారు.

అదేవిధంగా రాష్ట్రంలోని పలు సాధారణ ఇంజినీరింగ్ కళాశాలలకు ఏడాదికి కనీస ఫీజుగా రూ.45 వేలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఫీజుల వసూలు విషయంలో ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా క్యాపిటేషన్ ఫీజు లేదా డొనేషన్ల రూపంలో ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదని పేర్కొంది. వార్షిక ట్యూషన్ ఫీజును ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో అడ్వాన్స్‌గా వసూలు చేసుకోవచ్చు. కళాశాలలు సమర్పించిన వివరాల ఆధారంగా ప్రస్తుతం ఫీజులు నిర్ణయించినప్పటికీ, భవిష్యత్తులో భౌతిక తనిఖీల్లో ఏవైనా తప్పుడు వివరాలు ఉన్నట్లు తేలితే ఫీజులను సవరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన జీవో: https://epaper.dishadaily.com/4125547/Dishaweb/colage#page/1/1

Next Story