- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరి ఆస్తులు.. హక్కుదారులెవరు?.. లెక్క తేలితే వాటి విలువ రూ.వేల కోట్లకు పైగానే..
ఖాళీ జాగ ఉందంటే చాలు. పాగా వేసే జమానా. వివాదాల్లో ఉన్న భూములైతే బెదిరించి సెటిల్‌మెంట్ చేసే రోజులివి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖాళీ జాగ ఉందంటే చాలు. పాగా వేసే జమానా. వివాదాల్లో ఉన్న భూములైతే బెదిరించి సెటిల్‌మెంట్ చేసే రోజులివి. ఇక యజమానులే లేరని తెలిస్తే ఊరుకుంటారా? ఇదీ మూడు దశాబ్దాల నుంచి మొన్నటి వరకు సాగిన అక్రమార్కుల దందా. అందుకే ఎనిమీ ప్రాపర్టీస్‌ని గద్దల్లా ఎత్తుకెళ్లారు. తుపాకీ నీడలో కబ్జా చేశారు. నకిలీ యజమానులతో సంతకాలు చేయించి మరీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పొందారు. అందుకే ఇప్పుడు ఎనిమీ, ఎవాక్యూ ప్రాపర్టీ, బోనావెకేన్షియా భూములు కనుమరుగయ్యాయి.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎవాక్యూ ప్రాపర్టీలు ప్రభుత్వానివేనని తేల్చి చెప్పినా రికార్డుల్లో మాత్రమే మిగిలేటట్టు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలైన రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, బాలానగర్, మహేశ్వరం మండలాల్లోని ఎవాక్యూ, ఎనిమీ ప్రాపర్టీలకు ఓనర్స్ పుట్టుకొచ్చారు. 1948-52 వరకు రూపొందించిన బేసిక్ ప్రాపర్టీ రిజిస్టర్లనూ మాయం చేసి ఏ భూములు ఎవాక్యూ పరిధిలోకి వస్తాయో తెలియకుండా చేశారు. 2000-10 వరకు పుప్పాలగూడ ప్రాంతంలో చాలా స్థలాలకు ప్రైవేటు కాపాలా అధికంగా కనిపించేది. కొన్ని చోట్లయితే తుపాకులు కూడా పట్టుకొని కనిపించే వారని స్థానికులు చెప్పారు. దీన్ని బట్టి ఎనిమీ ప్రాపర్టీస్‌ని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్న వారు సామాన్యులు కారని తెలుస్తున్నది. కాందీశీకుల భూముల పక్కనే అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వెలిశాయి. దీంతో భూముల ధరలు అమాంతంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల విల్లాలు, వెంచర్లు నిర్మాణ దశలో దర్శనమిస్తున్నాయి. వీటన్నింటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడం వల్లే అక్రమాల పరంపర కొనసాగింది. ప్రభుత్వం ఈ భూముల్లో ఎక్కడెక్కడ ఎంత ఖాళీగా ఉన్నది, ఎంతమేరకు నిర్మాణాలు వెలిశాయన్న దానిపై సర్వే చేయించలేదు. పూర్తి స్థాయిలో లెక్కతేలితే వాటి విలువ రూ.కొన్ని వేల కోట్లు ఉంటుంది. తాజాగా కేంద్ర హోంసహాయ మంత్రి బండి సంజయ్ వీటిపై ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది.
మాయమైన బేసిక్ రిజిస్టర్..
కొన్నేండ్ల క్రితమే భూముల వివరాలు తెలిపే బేసిక్ ప్రాపర్టీ రిజిస్టర్ మాయమైందని తెలుస్తోంది. ఐనా ఎవాక్యూ, ఎనిమీ ప్రాపర్టీల లెక్క తేల్చొచ్చు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం, అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఈ రిజిస్టర్లు ఉండేవి. ఐతే అక్రమాల గుట్టు బయటికి పొక్కకుండా ఉండేందుకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కనిపించకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఐతే జిల్లాల విభజన టైంలో అత్రాఫ్ బల్దా జిల్లా నుంచి ఏయే రిజిస్టర్లు ఏయే కార్యాలయాలకు తరలించారో, అప్పగించారో తెలుసుకునేందుకు రికార్డులు ఉన్నాయి. అలాగే, జమాబందీ- ఆకార్‌బంద్ రిజిస్టర్, వసూల్ బాకీ, ఫైసల్ పట్టీ వంటి రిజిస్టర్లను పరిశీలించినా ఏయే ప్రాంతంలో ఏయేరకాల భూములు ఉన్నాయో లెక్క తేల్చొచ్చునని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రతి భూ మార్పిడిని ఆ జమానాలో పక్కాగా జమాబందీ- ఆకార్‌బంద్, వసూల్ బాకీ రిజిస్టర్లల్లో నిర్వహించే వారు. అలాగే నాజీం జమాబందీ కార్యకలాపాల రికార్డులను పరిశీలించినా ప్రాపర్టీల ఆచూకీని తెలుసుకునే వీలుంది. పైసల్ పట్టీలో అన్ని సర్వే నంబర్ల వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి వసూలు బాకీని ఫిక్స్ చేసే రిజిస్టర్ కూడా ఆసరా అందిస్తుంది. ఇవేవీ అందుబాటులోకి లేకపోయినా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో 1948-1956 మధ్య కాలంలోని గెజిట్ నోటిఫికేషన్లను పరిశీలించొచ్చు. జిల్లాల విభజన జరిగేటప్పుడు రికార్డుల పంపిణీ కార్యక్రమం ల్యాండ్ సర్వే, రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పర్యవేక్షణలోనే పూర్తయ్యింది. ఇప్పటికీ ప్రతిరికార్డు వారి ఆధీనంలోనే ఉన్నాయి. తనిఖీ చేస్తే రికార్డులు బయట పడే అవకాశం ఉంది.
పుప్పాలగూడలో ఏమైంది?
బేసిక్ ప్రాపర్టీ రిజిస్టర్‌లో ఒక్క పుప్పాలగూడ ప్రాంతంలోనే కాందీశీకుల భూములు 1,100 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. అయితే, 323 ఎకరాలే అని కొందరు చెబుతున్నారు. ఒకవేళ 1,100 ఎకరాల కాందీశీకుల భూములు ఉంటే ఇప్పుడు వెలిసిన నిర్మాణాలన్నీ అక్రమాల కిందే జమ కట్టాల్సి వస్తుంది. విల్లాలు, లే అవుట్లు, ఫాంహౌస్‌లు, హోటళ్లు ఇవన్నీ కాందీశీకుల భూములల్లోకి వెళ్లే అవకాశం ఉంది. పుప్పాలగూడలో కాందీశీకుల భూములు 1,100 ఎకరాలని, ఐతే 2006 నుంచే ఆ ఫైల్ కనుమరుగైందని ఓ అధికారి పదేండ్ల క్రితమే వాదించారు. ఇక్కడి కాందీశీకుల భూముల కబ్జాల ఆక్రమణకు అప్పటి పాలకుల ఉదాసీనతే కారణం. ఆ భూముల్లో తిష్ట వేయడానికి రాత్రింబవళ్లు కష్టపడి కబ్జా చేశారు. ఆ కబ్జా భూముల్లోనే కంపెనీలను నెలకొల్పి భాగస్వామ్యాలు పొందారు. అప్పట్లో ఈ కబ్జాల తతంగం నడుస్తున్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం అటువైపు వెళ్లే సాహసం కూడా చేయలేకపోయిందని రిటైర్డ్ అధికారులు అంటున్నారు.
ఎవరి ఆస్తులు.. ఎవరి వారసులు
ఎవరి ఆస్తులో.. హక్కుదారులెవరో.. దశాబ్దాలుగా ఖాళీ. ఎవరికో కేటాయించిన భూములు. ఈ పరిణామంతో హక్కుదారులు పుట్టుకొచ్చారు. జీపీఏ తీసుకున్నామంటూ మరికొందరు బయల్దేరారు. బెంగుళూరు, ముంబైల్లోనే ఉన్నామంటూ మరికొందరు రంగ ప్రవేశం చేశారు. అవినీతి అధికారుల అండదండలతో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఆ తర్వాత కాపలాదారులతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బహుళ అంతస్తుల భవనాలనూ నిర్మించారు. మధ్య తరగతి, ఎగుమ మధ్య తరగతి వర్గాలకూ అంటగట్టారు. రెవెన్యూ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య తగదా కొనసాగుతూనే ఉన్నది. కానీ ‘దేశ విభజన సమయంలో పాకిస్తాన్, చైనా దేశాలకు తరలివెళ్లిన వారి వారసులకు భారత్‌లో వదిలి వెళ్లిన ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదు. ఈ మేరకు 1968 నాటి ఎనిమీ ప్రాపర్టీస్(కాందీశీకులు)చట్టంలో సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక నుంచి ఈ ఆస్తులు ‘కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండియా’ విభాగంలో ఆధీనంలోకి వస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే రెండు వేల ఎకరాలకు పైగా ఉంది. దీని విలువ రూ.వేల కోట్లల్లో ఉండటం గమనార్హం. ఈ భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టింది. పైగా కస్టోడియన్ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ కమిషనర్) వ్యవహరించారు.
కొన్ని ఎనిమీ ప్రాపర్టీలు ఇవే..
– షేక్‌పేట మండలంలో సర్వే నం.403లో కొంత ఉండేది. అలాగే బంజారాహిల్స్ రోడ్డు నం.10లో 4 ఎకరాలు, బంజారాహిల్స్ నం.3లో 3 ఎకరాలు, తహశీల్దార్ కార్యాలయం వెనుక సర్వే నం.129/67లో 3 ఎకరాలు, దాని పక్కనే మరో 2.38 ఎకరాలు వంతున ఎనిమీ ప్రాపర్టీలు ఉన్నట్లు సమాచారం.
– ఓల్డ్‌బోయినపల్లిలో పాత సర్వే నంబర్లు 1, 41, 44, 45, 46, 50, 85, 86, 84, 87, 88, 89, 90, 92, 93, 94, 64, 62, 52/7, 52/5, 55/1 ల్లో సుమారు 50 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసింది.
– శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో సర్వే నం.2, 3, 13, 14, 15, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 51 నుంచి 70 వరకు, 91 నుంచి 99 వరకు, 102 నుంచి 112 వరకు, 113/1, 113/2, 118, 168 నుంచి 174 వరకు సుమారు 600 ఎకరాలకు పైగా ఉంది. ప్రతి సర్వే నంబర్‌లోనూ పదెకరాలకు పైగా ఉంది. గరిష్ఠంగా 22 ఎకరాల వరకు ఉంది.
– శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లో సర్వే నం.20లో 252 ఎకరాలు, 28లో 384.15 ఎకరాల వరకు ఉంది. మొత్తం 636 ఎకరాల వరకు ఉంది.
– గండిపేట మండలం పుప్పాలగూడలోనూ సర్వే నం.301 నుంచి 305 వరకు, 324 నుంచి 337 వరకు 190 ఎకరాలకు పైగానే ఉంది. అత్యంత వివాదాస్పదంగా మారాయి. అలాగే మంచిరేవులలోనూ ఉంది.
– టౌన్‌షిప్పులు, పెద్ద పెద్ద అపార్టుమెంట్ల మధ్య, నాచారం ప్రధాన రహదారి రాధిక చౌరస్తా నుంచి దమ్మాయిగూడెం వెళ్లే మార్గంలో సర్వే నం.9, 11, 47, 140, 141, 142, 143, 151, 152, 153, 676, 677లో 90.28 ఎకరాలు ఎవాక్యూ ప్రాపర్టీగా ఉన్నది.
– నానక్‌రాంగూడ, బాలానగర్, కుత్బుల్లాపూర్, కాప్రా, మల్కాజిగిరి, కీసర, ఘట్‌కేసర్ తదితర మండలాల్లోనూ అనేకం ఉన్నాయి.






