TG: గురుకులాల్లో 'డిప్యూటేషన్' సంస్కృతికి చెక్

by Gantepaka Srikanth |

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (TGSWREIS)లో బోధన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TG: గురుకులాల్లో డిప్యూటేషన్ సంస్కృతికి చెక్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (TGSWREIS)లో బోధన వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హెడ్‌ఆఫీస్‌తో పాటు ఇతర విభాగాల్లో ఓడీ (డిప్యూటేషన్)పై సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ స్టాఫ్ డిప్యూటేషన్లను రద్దు చేస్తూ TGSWREIS కార్యదర్శి (FAC) శారద గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వివిధ టీచింగ్ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 16 మంది సిబ్బందిని తిరిగి వారి పూర్వ స్థానానికి పంపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా గురుకుల విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండగా, మరోవైపు కొందరు టీచింగ్ సిబ్బంది దీర్ఘకాలంగా హెడ్‌ఆఫీస్‌లోనే కొనసాగుతున్నారనే అంశంపై ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలువురు టీచింగ్ సిబ్బంది సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, బోధన సిబ్బంది తిరిగి పాఠశాలల్లోనే విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ఫలితాల మెరుగుదల, బోధన వ్యవస్థలో జవాబుదారీతనం పెంచే దిశగా ఈ నిర్ణయం కీలకమని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న డిప్యూటేషన్ విధానానికి చెక్ పెట్టి, విద్యాసంస్థల్లో ఖాళీలను తగ్గిస్తూ విద్యార్థులకు పూర్తి స్థాయి బోధన అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తల్లిదండ్రులు స్వాగతించడంతోపాటు మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని యూనియన్ నాయకులు హర్షించారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్న సంకేతంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్ణయం నిలిచిందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.

Next Story