రవాణా శాఖలో 'వాహన్' సందడి.. ఇక అంతా డిజిటల్ మయం!

by Naga Rani Yarlagadda |

తెలంగాణ రవాణా శాఖలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. NIC సహకారంతో తీసుకొచ్చిన వాహన్ పోర్టల్ దేశవ్యాప్తంగా అమలవుతోంది.

రవాణా శాఖలో వాహన్ సందడి.. ఇక అంతా డిజిటల్ మయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా శాఖలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాహన సేవలను మరింత సరళీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్ ఫర్ మెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సహకారంతో ప్రవేశపెట్టిన వాహన్ పోర్టల్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నది. ప్రస్తుతం ఈ పోర్టల్ సేవలు దశలవారీగా స్టెబిలైజ్ అవుతుండటంతో వచ్చే 15 రోజుల్లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పురోగతి

కొద్దిరోజులుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ డిజిటల్ వ్యవస్థలో ఇప్పటికే కీలక మైలురాళ్లను అధిగమించినట్టు రవాణా శాఖ తెలిపింది. కొత్త వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) ప్రక్రియ విజయవంతంగా సాగుతున్నది. దీనికి సంబంధించిన మాడ్యూల్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సేవలకు సిద్ధమైందని అధికారులు తెలిపారు. శాశ్వత రిజిస్ట్రేషన్(పీఆర్) సైతం క్రమంగా వేగం పుంజుకుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2200 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించారు. మరోవైపు ప్రత్యేక నంబర్ల కోసం నిర్వహించే వేలం పాటలనూ ఆన్‌లైన్ చేశారు. ఇప్పటివరకు 858 వేలం పాటలు విజయవంతంగా ముగిశాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా పైరవీలకు తావులేకుండా పోయింది.

ఎన్‌ఐసీ పర్యవేక్షణ

సాంకేతిక కారణాలతో అక్కడక్కడ చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాహన్ పోర్టల్ పనితీరును ఎన్‌ఐసీ బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది. మిగిలిన మాడ్యూల్స్‌ను కూడా అనుసంధానించే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మరో రెండు వారాల్లో వ్యవస్థ మొత్తం స్థిరపడితే పౌరులు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటి నుంచే రవాణాశాఖ సేవలను పొందే వీలుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిజిటలైజేషన్ వైపు మళ్తున్న క్రమంలో సాంకేతిక మార్పులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏర్పడిన జాప్యాన్ని భరించిన వాహన డీలర్లు, ప్రజలకు రవాణాశాఖ కృతజ్ఞతలు తెలిపింది. ప్రజలకు మరింత జవాబుదారీతనంతో సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని.. ఈ ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ బాధ్యతగా పేర్కొన్నారు.

Next Story