ప్లాట్ ప‌క్క‌న పార్కు మాయం..! ప్ర‌జావ‌స‌రాలే లక్ష్యంగా క‌బ్జాలు.. హైడ్రా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు

by Ramesh Naini |

ప్లాట్ ప‌క్క‌న పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే క‌బ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వ‌రూపాల‌ను మార్చేస్తున్నారు.

ప్లాట్ ప‌క్క‌న పార్కు మాయం..! ప్ర‌జావ‌స‌రాలే లక్ష్యంగా క‌బ్జాలు.. హైడ్రా ప్ర‌జావాణికి 48 ఫిర్యాదులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్లాట్ ప‌క్క‌న పార్కు ఉంటే మాయం చేస్తున్నారు. డెడ్ ఎండ్ రోడ్డు ఉంటే క‌బ్జా చేస్తున్నారు. లే ఔట్ స్వ‌రూపాల‌ను మార్చేస్తున్నారు. చెరువుల‌ను క‌లుపుతూ సాగే వ‌ర‌ద కాలువ‌ల‌ను కూడా ఇష్టానుసారం మ‌లుపులు తిప్పుతున్నారు. దీంతో కాల‌నీలు, బ‌స్తీలు నీట మునుగుతున్నాయ‌ని ప‌లువురు నివాసితులు (Hydra Prajavani) హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. ర‌హ‌దారుల‌ను ఆక్ర‌మించేసి వ్యాపారాలు చేస్తుండ‌డంతో ఆ మార్గంలో వెళ్ల‌డానికి ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని ప‌లువురు వాపోయారు. శ్మ‌శాన‌వాటిక‌ల‌తో పాటు చెరువుల‌ను చెర‌బ‌డుతున్నార‌ని ప‌లురువు హైడ్రాను ఆశ్ర‌యించారు. రావిర్యాల పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు వ‌చ్చి చేర‌డంతో పైన ఉన్న హెచ్ఎండీఏ అనుమ‌తి పొందిన లే ఔట్లు కూడా మునిగిపోతున్నాయ‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం కౌశ‌ల్యా కాల‌నీలో పార్కుతో పాటు.. ర‌హ‌దారుల‌ను క‌బ్జా చేసి దుకాణాలు ఏర్పాటు చేశార‌ని.. దీంతో రాజీవ్‌గాంధీన‌గ‌ర్ నుంచి మియాపూర్ ప్ర‌ధాన ర‌హ‌దారికి చేర‌డం క‌ష్టంగా ఉంద‌ని ప‌లువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌ స్వ‌యంగా ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా...

- మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా, దుండిగ‌ల్ మున్సిపాలిటీ, మ‌ల్లంపేట విలేజీలోని రామ‌చంద్ర‌య్య కాల‌నీ మురుగు, వ‌ర‌ద నీటిలో గ‌త 8 నెల‌లుగా మునిగి ఉంద‌ని ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెన్నం చెరువు నుంచి రేళ్ల చెరువుకు వెళ్లే వ‌ర‌ద కాలువ‌ను మూసేయ‌డంతో వ‌ర‌ద త‌మ కాల‌నీని ముంచెత్తి దాదాపు 40 ఇళ్లు వ‌ర‌ద‌నీటిలోనే ఉంటున్నాయ‌ని చెప్పారు. ఇళ్లు ఖాళీ చేసి వేరే చోట అద్దెకు ఉంటున్నామ‌ని వాపోయారు. గ‌తంలో ఉన్న వ‌ర‌ద కాలువ‌ను పున‌రుద్ధ‌రిస్తే ఈ వ‌ర‌ద ముప్పునుంచి బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌కు ఫొటోల‌తో స‌హా చూపించారు. గ‌తంలో హైడ్రా చ‌ర్య‌ల‌వ‌ల్ల తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించినా.. శాశ్వ‌త ప‌రిష్కారం చూపించాల‌ని కోరారు.

- మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లాలోని ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువుతో పాటు.. అక్క‌డ ఉన్నస్మ‌శాన వాటిక‌ను క‌బ్జా చేస్తున్నార‌ని.. అలాగే 308 స‌ర్వే నంబ‌రులోని ప్ర‌భుత్వ భూమిని మాయం చేస్తున్నార‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ మండ‌లాల ప‌రిధిలో స‌రిహ‌ద్దు ఉండ‌డంతో పాటు.. కూక‌ట్‌ప‌ల్లి మున్సిపాలిటీ, నిజాంపేట మున్సిపాలిటీకి మ‌ధ్య‌న ఉండ‌డంతో ఆయా శాఖ‌ల అధికారులు బాధ్య‌త ప‌డ‌డంలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాజుల‌రామారం విలేజ్‌, ప్ర‌గ‌తిన‌గ‌ర్ విలేజ్ స‌రిహ‌ద్దుల్లో 307 స‌ర్వే నంబ‌రు మాదిరే 308లో కూడా ప్ర‌భుత్వ భూమి ఉంద‌ని తెలిపారు. ఇటీవ‌ల 307 స‌ర్వే నంబ‌రులో 300ల ఎక‌రాల‌కు పైగా ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంద‌ని.. 308లో కూడా ఉన్న ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని సూచించారు.

- అమీర్‌పేట నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే మార్గంలో ర‌హ‌దారిపైనే ఇసుక‌, ఎర్ర‌మ‌ట్టి, మొక్క‌ల‌కు ఎరువు రాసులు పోసి అమ్ముతున్నార‌ని.. దీంతో ఆ మార్గంలో వెళ్లేందుకు అవ‌కాశం లేకుండా పోతోంద‌ని అక్క‌డి నివాసితులు వాపోయారు. కొన్ని ఏళ్లుగా రోడ్డునే అడ్డాగా చేసుకుని వ్యాపారాలు చేస్తున్నార‌ని.. ఇదేమ‌ని అడిగితే దాడులు చేస్తున్నార‌ని వాపోయారు. ఇదే విష‌యాన్ని స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాత్రిపూట పెద్ద లారీల నుంచి మ‌ట్టిని, ఇసుక‌ను, ఎరువును ఇక్క‌డ డంప్ చేయ‌డంతో ప్ర‌శాంత‌త‌ను కోల్పోయామ‌ని.. స‌గానికి పైగా రోడ్డును ఆక్ర‌మించి చేస్తున్న వ్యాపారాన్ని తొల‌గించాల‌ని కోరారు.

- మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కీస‌ర మండ‌లం నాగారం మున్సిపాలిటీ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌రు 93లో ప్ర‌భుత్వం కేటాయించిన 100 గ‌జాల స్థ‌లంలో శ్రీ రామ‌లింగేశ్వ‌ర మున్నూరు కాపు సంఘం భ‌వ‌నాన్ని 5 ఏళ్ల క్రితం నిర్మించుకున్నామ‌ని.. దీనిని అప్ప‌టి మంత్రి సీహెచ్ మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. నేడు దానిని కూల్చివేయ‌డానికి కొంత‌ మంది సిద్ధ‌ప‌డుతున్నార‌ని.. ఆ సంఘం ప్ర‌తినిధులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గ‌తంలో నిర్మించిన నిర్మాణాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా ప‌దేప‌ది చెబుతున్న విష‌యాన్ని గుర్తు చేస్తూ.. దీనిని సామాజిక అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నామ‌ని ఆ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా దృష్టికి తెచ్చారు.

-మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మునిసిపాలిటీ ఘట్కేసర్ మండలంలో జయపురి కాలనీ లేఔట్‌లో కొంత‌మంది క‌బ్జా చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. పార్కుల‌తో పాటు.. ర‌హ‌దారుల‌ను కూడా వ‌ద‌ల‌కుండా ఆక్ర‌మించి అడ్డుగా ప్ర‌హ‌రీలు నిర్మిస్తున్నార‌ని అక్క‌డి నివాసితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని తాము కోరితే గూండాల‌తో దాడులు చేయిస్తున్నార‌ని ప‌లువురు వాపోయారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని ఫిర్యాదు చేశారు.

-సంగారెడ్డి- జిల్లా అమీన్‌పూర్ మండలంలోని చక్రపురి కాలనీలోని పార్క్ భూమిని కొంతమంది ఆక్రమించారని హైడ్రాకు చక్రపురి కాలనీ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. హుడా ఆమోదించిన లేఅవుట్ ప్రకారం కాలనీలో ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని పార్కులు, ర‌హ‌దారుల అభివృద్ధికి వినియోగించాల‌ని ఈ మేర‌కు హైడ్రా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చ‌క్ర‌పురి కాల‌నీ ప్ర‌తినిధులు కోరారు.

Next Story