Encounter: పండుగ పూట ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

by Prasad Jukanti |

దేశమంతటా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటే అడవుల్లో మాత్రం కాల్పుల మోత మోగింది.

Encounter: పండుగ పూట ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో/ భద్రాచలం: ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చర్యలను భద్రతా బలగాలు కొనసాగిస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటుంటే అడవుల్లో మాత్రం కాల్పుల మోత మోగింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ (Encounter) కొనసాగుతోంది. గడ్చిరోలి (Gadchiroli)-నారాయణ్‌పూర్ (Narayanpur) సరిహద్దులోని కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్, సీ-60 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టులు.. బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఒకటి ఎస్ఎల్‌ఆర్ రైఫిల్, రెండు ఇన్సాస్ రైఫిల్స్, 01.303 రైఫిల్ ఒకటి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మిగిలిన మావోయిస్టుల కోసం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతామని పేర్కొన్నారు.

Next Story