ఆఫీసుల్లో ఖాళీ కుర్చీలు.. క్షేత్రస్థాయిలో రైతుల గోస

by Kema Shiva Kumar |

తెలంగాణ వ్యవసాయ శాఖలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏఈవోలపై పనిభారం, ఉన్నతాధికారుల గైర్హాజరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆఫీసుల్లో ఖాళీ కుర్చీలు.. క్షేత్రస్థాయిలో రైతుల గోస
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అగ్రికల్చర్​శాఖలో పని భారమంతా విస్తరణాధికారులే మోస్తున్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా అమలు చేయాల్సిన బాధ్యత వారి భుజాలపై ఉంది. రాష్ట్రస్థాయి నుంచి మండలస్థాయి అధికారులవరకు ఏఈవోలు చురుకుగా ఉంటనే వారికి రోజు వారీ సమయం గడుస్తోంది. ఒక వేళ విస్తరణాధికారులు చిన్నపాటి తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకడటం లేదని విమర్శలున్నాయి. పై అధికారులంతా కిందిస్థాయి సిబ్బందికి మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేయడం​తప్పా ఏ పనిచేయడంలేదని ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు విధులకు సక్రమంగా రాకుండా ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లస్టర్ల పరిధిలో పనిచేస్తే ఏఈవో తప్పా ఉన్నతాధికారులు వేళాపాళా లేకుండా కార్యాలయాలకు వస్తున్నట్టు టాక్​ఉంది. రైతులు తమ సమస్యల కోసం వెళితే అటెండర్లు, ఖాళీ కుర్చీలు తప్పా అధికారులు అందుబాటులో ఉండటం లేదు. కొందరు అధికారులు ఏకంగా ప్రైవేటు సిబ్బందిని నియమించుకుని సొంత వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

సంతకాలకే పరిమితం..

రాష్ట్రంలోని అగ్రికల్చర్​సెక్రటరీ నుంచి డివిజన్​వ్యవసాయ శాఖ అధికారి వరకు విస్తరణాధికారుల శ్రమ మీదనే ఆధారపడి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. అన్నదాతలకు చేయాల్సిన పని ఏఈవోలు చేస్తుండగా పై అధికారులు సంతకాలకే పరిమితమయ్యారనే టాక్​వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, సన్న బియ్యంకు బోనస్, రుణమాఫీ, డిజిటల్ అగ్రి మిషన్, యూరియా యాప్, రైతు నేస్తం వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలు బాధ్యతలను అధికారులకు అప్పజెప్పింది. కానీ వ్యవసాయ శాఖలో అధికారుల పని తీరును, హాజరును పర్యవేక్షించే ఏర్పాట్లు చేయకపోవడంతో మండల, డివిజన్ స్థాయి వ్యవసాయ అధికారులు కార్యాలయాలలో అందుబాటులో ఉండటం లేదని రైతులు ఫిర్యాదులు చేయడం గత కొంత కాలంగా పరిపాటిగా మారింది. విధులకు సరిగా హాజరుకావడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల వ్యవసాయ అధికారిపై ఆ మండల రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ఆరోపణలకు మరింత బలం చేకూరింది.

చర్యలు తీసుకోండి..

వ్యవసాయ శాఖలో మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు 605 మంది, డివిజన్ స్థాయిలో ఏడీఏలు 122 మంది , జిల్లా స్థాయిలో 32 మంది డీఏఓలు పని చేస్తున్నారు. అయితే వీరు నిత్యం కార్యాలయాలకు సకాలంలో హాజరు అవుతున్నారా? లేదా? అని పర్యవేక్షించడానికి ఎలాంటి హాజరు నమోదు యంత్రాంగం లేకపోవడంతో అధికారులు తమ సొంత పనులలో బిజీగా ఉంటూ ఆఫీసు సంబంధిత పనులను తమ కింది స్థాయిలో పనిచేసే ఏఈఓల తో చేపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సలహాలు సూచనలకోసం ఏవో కార్యాలయానికి వెళ్లే రైతులు అక్కడ కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో నిరాశగా మళ్లీ రైతు వేదికలకు వచ్చి ఏఈఓ లను సంప్రదించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖలో 4 కేడర్లలో అధికారులు పనిచేస్తుంటే.. కేవలం తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా ఒక్క ఏఈఓ కేడర్ కు మాత్రమే అటెండెన్స్ కోసం యాక్టివిటీ లాగర్ యాప్ ప్రవేశపెట్టడంపై ఏఈఓ లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మిగతా అన్ని కేడర్ల అధికారులకు సైతం యాప్ లో అటెండెన్స్ పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అగ్రికల్చర్​అధికారులు 32, డివిజన్ అధికారులు 122, మండల స్థాయిలో 605 మంది, క్లస్టర్​ పరిధిలో 2604 మంది రైతులకు సేవలందించేందుకు విధులు నిర్వహించాలి.

మంత్రి ఆదేశాలిచ్చినా..

అధికారుల హాజరును మెరుగుపరచడం, వారిలో జవాబుదారీతనం పెంచే ఉద్దేశ్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరచూ వ్యవసాయ అనుబంధ శాఖల కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు దీనికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ డిజిటల్ యుగంలో చిన్న చిన్న ప్రయివేట్ కంపెనీలు డైలీ వేజ్ లేబర్ ల హాజరును సైతం ఘంటా పథంగా పర్యవేక్షించడానికి ఫేషియల్ అటెండెన్స్, బయోమెట్రిక్, వివిధ ఆన్ లైన్ యాప్ లు, సాఫ్ట్ వేర్ లు వినియోగిస్తుంటే లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారుల అటెండెన్స్ పర్యవేక్షించే విషయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికాలు అలసత్వం వహించడంపై పలు రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని దేశ విత్తన భాండాగారంగా మారుస్తాం అని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా అలసత్వం వీడి వ్యవసాయ శాఖ అధికారుల హాజరును మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

తుది దశకు సర్వే..

గత ఫిబ్రవరి నుంచి కేంద్రం ఆదేశాలతో పంట సర్వే ప్రారంభమైంది. ఇప్పటివరకు 90 శాతం పూర్తికాగా వాలంటర్ల సహాయంతో 9795 గ్రామాలు సర్వే చేయగా, సర్వే పటాలు లేని గ్రామాలను ఏఈవో చేశారు. మరో వైపు వాలంటర్లీ పనితీరు గమనిస్తూ పంట సర్వే పారదర్శకంగా జరిగేలా విస్తరణాధికారులు జాగ్రత్తలు చేపట్టారు. వీటితో పాటు రాష్ట్రంలో మొక్కజోన్న, సొయా, వేరు శనగ పంటలు కోనుగోలు చేసేందుకు కూడా పంటల వివరాలు వ్యవసాయ శాఖకు అందించారు. ప్రస్తుతం వరి పంట కోతలకు రావడంతో వాటికి సంబంధిన క్రాప్​సర్వే కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా ఏఈవోలు గడుపుతున్నారు.

Next Story