- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఇందిరా మహిళా శక్తి' భవనాలు: గ్రామీణ ప్రగతిలో సరికొత్త మైలురాయి

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా మహిళా సంఘాల (వీఓ) భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం యజ్ఞంలా అమలవుతూ మరో మైలురాయిగా నిలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలతో 12,728 గ్రామాల్లో 8,193 స్థలాలను అధికారులు గుర్తించారు. ఇందులో 6,261 భవనాలకు కలెక్టర్ల నుంచి అనుమతులు లభించగా 5,017 భవనాల నిర్మాణాలకు అంచనాలు సిద్ధం అయ్యాయి. మంత్రి సీతక్క నిత్య పర్యవేక్షణలో సెర్ప్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయగా జిల్లాల వారీగా పనులు వేగంగా జరుగుతున్నాయి.
యాదాద్రిలో తొలి వేదిక
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం సర్వేపల్లి గ్రామంలో వీఓ భవనం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం ఆల్వాల్ గ్రామ పంచాయతీలో కూడా భవనం పూర్తైంది. ఈ భవనాలు గ్రామీణ మహిళల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు, పరస్పర ఐక్యతకు ప్రతీకలుగా నిలవనున్నాయి. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు కార్యకలాపాలకు కేంద్రాలుగా మారనున్నాయి. అవసరమైతే మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయ కేంద్రాలుగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
స్వయం ఉపాధి..
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి సీతక్క మహిళా భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ మేరకు ప్రతి గ్రామంలో మహిళలకు బలమైన వేదిక కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని సీతక్క తెలిపారు. మహిళా సంఘాల భవనాలు వారి ఆర్థిక, సామాజిక బలోపేతానికి కేంద్రాలుగా మారనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకోవడానికి, ఒకచోట చేరి నిర్ణయాలు తీసుకునే వేదికగా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. నిర్దిష్ట కాలంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసి మహిళలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.






