ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ దానకిషోర్

by Kema Shiva Kumar |

తెలంగాణలో జూలై 1 నుంచి కొత్తగా 'వీబీజీ రామ్‌జీ' పథకం అమల్లోకి రానున్నట్లు పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ప్రకటించారు.

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: పంచాయతీరాజ్ స్పెషల్ సెక్రటరీ దానకిషోర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకం కింద వేజ్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం జూన్ 30 వరకు కొనసాగుతుందని, జూలై 1 నుంచి కొత్తగా వీబీజీ రామ్‌జీ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. బుధవారం సచివాలయంలో సెర్ప్ సీఈఓ దివ్యతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేగా పనులు, చేయూత పెన్షన్ సర్వే పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుకు 15 లక్షల మంది కార్మికులు నరేగా పనుల్లో పాల్గొంటుండగా, వెంటనే ఆ సంఖ్యను 20 లక్షలకు పెంచాలని సూచించారు. ప్రతి రోజు పనుల కోసం ముందు రోజే కార్మికుల సమీకరణ చేపట్టాలని, పనులు గ్రామ హ్యాబిటేషన్ పరిధిలోనే ఉండేలా చూడాలని తెలిపారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 5.30 గంటలకే పనులు ప్రారంభించి, ప్రధాన పనులను ఉదయం 10.30 గంటల లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 40 రోజుల పాటు ఎంపీడీవోలు పూర్తిగా నరేగా పనులపైనే దృష్టి సారించి, పనులను వేగవంతంగా అమలు చేయాలన్నారు. అసైన్డ్ భూముల్లో కూడా ఫామ్‌పాండ్‌ల నిర్మాణ పనులను చేపట్టి రైతులకు ఉపయోగకరంగా మలచాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం వేళల్లో జిల్లా కలెక్టర్లు స్వయంగా ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి సుమారు 8 వేల మహిళా గ్రామ సంఘ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో, రాబోయే 40 రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, పాఠశాలల ప్రహరీ గోడలు, మహిళా సంఘాల భవనాలు వంటి నిర్మాణాలను నరేగా కింద ప్రణాళిక చేయవచ్చని తెలిపారు. గ్రామాల్లో సీసీ డ్రెయిన్‌ల శుభ్రత పనులను నిరంతరం చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మహిళా సంఘాల బ్యాంకు లింకేజి రుణాల రికవరీపై సెర్ప్ సీఈఓ దివ్య వివరిస్తూ.. ఎన్‌పీఏలను జీరోకి తీసుకురావడంలో జిల్లాలు ముందుండాలని తెలిపారు. ముఖ్యంగా స్త్రీనిధి రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకు రుణాల మంజూరు, స్త్రీనిధి రుణాల మంజూరు, చెల్లింపులు, ఎన్‌పీఏల నియంత్రణపై ప్రతి నెల జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.

Next Story