ఐదేళ్లలో కనిష్టానికి ఉపాధి హామీ పనులు: 7 కోట్లకు పడిపోయిన పనిదినాలు!

by Kema Shiva Kumar |

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీ చట్టం ప్రభావంతో తెలంగాణలో కూలీల పనిదినాలు సగానికి పడిపోయాయి.

ఐదేళ్లలో కనిష్టానికి ఉపాధి హామీ పనులు:  7 కోట్లకు పడిపోయిన పనిదినాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం కూలీల పనిదినాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త చట్టం వస్తున్నదంటూ జరిగిన ప్రచారం, కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలతో కూలీ మొత్తం వస్తుందో రాదోననే అనుమానంతో ఉపాధి పనులపై కూలీలు ఆసక్తి చూపలేదనే విషయం గణాంకాలను బట్టి తెలుస్తున్నది. గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. రాష్ట్రంలో 52.21 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్ కార్డులు జారీ చేయగా.. ఇందులో 1.06 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే 30.44 లక్షల జాబ్ కార్డుదారులు మాత్రమే చురుగ్గా పనుల్లో పాల్గొంటున్నట్లుగా గుర్తించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీకి మొత్తం రూ.3,403 కోట్ల నిధులను వెచ్చించారు.

పల్లెల్లో తగ్గిన పనులు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణ సద్వినియోగం చేసుకుంటున్నది. ఓ వైపు కూలీలకు ఉపాధి కల్పిస్తూనే.. అదే సమయంలో మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లను నిర్మించింది. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఉండటానికి ప్రధాన కారణం ఈ ఉపాధి హామీ పనులే. వ్యవసాయ పనులు లేని సమయాల్లో ఉపాధి హామీ పనులు కూలీలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ 2025–26లో మాత్రం 7.26 కోట్ల పనిదినాలు మాత్రమే పూర్తయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021-22లో ఇది 14.42 కోట్లు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో కూలీలు తీవ్రంగా నష్టపోయినట్లుగా నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం షరతులతో ఆందోళన

కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తూ.. షరతులను పెంచుతూ వచ్చింది. ఈ ఏడాది ఏకంగా చట్టాన్ని మార్చింది. తన వాటాను తగ్గించుకొని రాష్ట్రంపై భారం మోపింది. 40 శాతం నిధులను ఇకపై రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. దీంతో ఈ పథకం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో కూలీలు ఈ పనులకు దూరమయ్యారనే చర్చ జరుగుతున్నది. గత ఐదేండ్ల పనిదినాలను పరిశీలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో సగానికి పైగా పని దినాలు తగ్గినట్లు స్పష్టమవుతున్నది. వంద రోజుల పనిదినాలను పూర్తి చేసిన కుటుంబాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2024-25లో 92వేల కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకుంటే.. 2025-26లో 22 వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. అయితే ఐదేళ్లతో పోల్చుకుంటే పని దినాల్లో ఎస్టీల శాతం 20 నుంచి 23కు పెరిగింది. అదే సమయంలో ఎస్సీల శాతం తగ్గింది.

అధికారులు కన్‌ఫ్యూజ్

కేంద్రం తీసుకువచ్చిన కొత్త చట్టాన్ని కాదని.. పాత విధానంలో ఏప్రిల్ నెలకు 2.50 కోట్ల పనిదినాలను కేటాయించారు. దీంతో రాష్ట్ర అధికారులకు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. కొత్త చట్టం ఆమోదం పొందింది అంటూనే మరో వైపు పాత చట్టం ప్రకారం పనిదినాలను కేటాయించడంతో అదే విధంగా పనులను చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై వేచి చూస్తూ ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఐదేళ్లుగా ఉపాధి హామీ పని దినాలు ఇలా..

Next Story