అడ్మిషన్లు చేయకపోతే మీ జాబ్ ఊస్ట్.. ప్రైవేట్ టీచర్లకు యాజమాన్యాలు బ్లాక్ మెయిల్

by Prasad Jukanti |   (  Updated:2026-04-21 11:38:46  IST  )

ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్ల విషయంలో ఉపాధ్యాయులకు యాజమాన్యాలు టార్గెట్లు విధించడం పట్ల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడ్మిషన్లు చేయకపోతే మీ జాబ్ ఊస్ట్.. ప్రైవేట్ టీచర్లకు యాజమాన్యాలు బ్లాక్ మెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండాకాలం సెలవులు వచ్చాయంటే స్కూల్ పిల్లలకు ప్రభుత్వ టీచర్లకు పండగే. కానీ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఇన్నాళ్లు విద్యార్థులకు మంచి మార్కులు, ర్యాంకులు తెప్పించేందుకు బుర్రలు బద్దలు చేసుకున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు యాజమాన్యాలు కొత్త టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నాయి. వచ్చే విద్యాసంత్సరానికి అడ్మిషన్ల వేట బాధ్యతలు అప్పగిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఏకంగా తాముచెప్పినన్ని అడ్మిషన్లు ఇవ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కరాఖండిగా తేల్చి చెబుతుండటంతో ఉద్యోగం కాపాడుకునేందుకు మండుటెండల్లో స్కూల్ కరపత్రాలను పట్టుకుని వీధుల వెంట తిరగాల్సి వస్తోందని ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెటింగ్ ఏజెంట్లుగా టీచర్లు:

ప్రభుత్వాలు మారినా, విద్యా వ్యవస్థలో మార్పు మాత్రం కనిపించడం లేదని ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ నానాటికీ మరింత పెరిగి తమను రాచిరంపాన పెడుతున్నాయని ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్‍లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా TPTF రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్ హాజరై మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ మరింత పెరిగిందని ఉపాధ్యాయులను అనేక ఆంక్షలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల కోసం టార్గెట్లు పెట్టి ఎర్రటి ఎండలో ఇల్లిల్లూ తిప్పుతూ ఉపాధ్యాయులను మార్కెటింగ్ ఏజెంట్లుగా మార్చి వారి గౌరవాన్ని తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మిషన్లు చేయకపోతే జీతం ఉండదని, ఇంక్రిమెంట్లు ఉండవని, వచ్చే విద్యాసంవత్సరం నుండి ఉద్యోగం కూడా ఉండదని యాజమాన్యాలు బెదిరిస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం TPTF ఆధ్వర్యంలో అనేకసార్లు విద్యాశాఖ అధికారులను, మంత్రులను కలిసి వినతపత్రాలను ఇచ్చిన ఫలితం లేకుండా పోయిందన్నారు.

జీతాలు నిల్ టార్గెట్లు ఫుల్:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల ప్రైవేట్ పాఠశాలలో 3 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తుంటే వీరిలో 70 శాతం మహిళలే పని చేస్తున్నారని బయ్యా శివరాజ్ చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తక్కువ వేతనాలకే అధిక పని గంటలతో పాటు సరైన సమయానికి జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీరికి ఉద్యోగ భద్రత, ESI, EPF లేదని ధ్వజమెత్తారు. పేరెంట్స్ వద్ద నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేసి ఉపాధ్యాయులకు కేవలం 10 నెలల జీతాలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆకునూరి మురళి అధ్యక్షతన విద్యాకమిషన్ ఏర్పాటు చేసినా అందులో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి నివేదికలు ఇవ్వలేదున్నారు. విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రే తమ సమస్యలకు పరిష్కారం చూపి న్యాయం చేయాలని కోరుతున్నారు.

నార్త్ స్కూల్స్ లో మన వాళ్లకు ఉద్యోగాలేవి?

కాగా రాష్ట్రంలో కార్పొరేట్స్ స్కూల్స్ మాత్రమే కాకుండా నార్త్ నుంచి కూడా స్కూల్స్ వస్తున్నాయి. అలాంటి వాటిలో ఉద్యోగాలు నార్త్ వాళ్లకే ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడాలని ప్రభుత్వ టీచర్ కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తున్న వారు చివరకు ప్రైవేట్ స్కూళ్లలో టీచింగ్ చేస్తున్నారు. అయితే వారిలో చాలా మందికి స్కూల్ యాజమాన్యాలు అవకాశం ఇవ్వకుండా నార్త్ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడంపై ఇటీవల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం స్పందించారు. తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వని స్కూళ్లకు ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వకూడదన్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమకారులకు స్కూల్స్ స్థాపించేలా పర్మిషన్లు ఇవ్వాలని వాళ్లైనా బతుకుతారని సూచించారు.

Next Story